గంగ గట్టున శవాల గుట్టలు.. పీక్కుతింటున్న కుక్కలు!
దేశంలో కరోనా వైరస్ మారణహోమాన్ని సృష్టిస్తోంది. ఈ వైరస్ ధాటికి అధికారిక లెక్కల ప్రకారం వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. కానీ, అనధికారికంగా మాత్రం ఈ సంఖ్య లక్షల్లో వుంది. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి భీతావహంగా ఉంది. తాజాగ గంగానది ఒడ్డుకు వందకు పైగా మృతదేహాలు కొట్టుకునివచ్చాయి. ఇవన్నీ కరోనా మృతదేహాలుగా భావిస్తున్నారు. ఇలా గట్టుగు వచ్చిన మృతదేహాలను కుక్కలు పీక్కుతుంటున్నాయి. ఈ శవాలన్నీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చాయని భావిస్తున్నారు.
సాధారణంగా కరోనా వైరస్ సోకి ఎవరైనా మరణిస్తే ఆ మృతదేహాన్ని పకడ్బందీగా ప్యాకింగ్ చేస్తారు. చివరకు ఆ శవాన్ని కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వరు. కానీ, బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లా చౌసా పట్టణంలో గంగా నది ఒడ్డున సోమవారం పొద్దున్నే రేగిన కలకలం ఇది. ఈ భీతావహ దృశ్యాలను చూసి స్థానికులు బెంబేలెత్తిపోయారు. దీంతో పట్టణంలో వైరస్ వ్యాప్తి పెరుగుతుందని ఆందోళన చెందారు.
కాగా, ఈ మృతదేహాలు ఉత్తరప్రదేశ్ నుంచే కొట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. యూపీలో వైరస్ ఉధృతి తీవ్రంగా ఉంది. రోజుకు వందల కొద్దీ మరణాలు సంభవిస్తున్నాయి. శ్మశానాల్లో అంత్యక్రియలకు సమయం, స్థలం ఉండటం లేదు. మృతదేహాలను నదిలో వదిలేసే సంప్రదాయం బీహార్‌లో లేదు. కానీ, యూపీలో ఉంది.
ఇలా నదిలో విడిచిపెట్టిన శవాల్లో 150 మృతదేహాలు సరిహద్దులోని చౌసా బ్లాక్‌లో గంగా నది ఒడ్డున కనిపించాయి. ప్రవాహం తగ్గడంతో మహదేవ్ ఘాట్ వద్ద ఒడ్డుకు చేరిన శవాలను వీధి కుక్కలు తింటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్థానికులైతే 400-500 మృతదేహాలను చూసినట్లు చెబుతున్నారు. అధికారులు 15 శవాలను స్వాధీనం చేసుకున్నారు.
మృతుల్లో ఎవరూ బక్సర్ జిల్లా వారు కాదన్నారు. ఈ మృతదేహాలు యూపీలోని బహ్రయిచ్, వారాణాసి, అలహాబాద్ వాసులవి అయి ఉం డొచ్చని ఓ అధికారి చెప్పారు. దీనిపై యూపీ, బీహార్ ప్రభుత్వాలు పరస్పర విమర్శలకు దిగాయి. చివరకు బీహార్ సర్కారు విచారణకు ఆదేశించింది. యూపీలోని కాన్పూర్, హమీర్‌పూర్‌లోనూ శనివారం యమునా నదిలో పదులకొద్దీ మృతదేహాలు కొట్టుకొస్తూ కనిపించాయి.