సోనూసూద్‌కు బాంబే హైకోర్టులో చుక్కెదురు.. పిటిషన్ తిరస్కరణ
ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్‌కు బాంబే హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. బీఎంసీ నోటీసులను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఇంతకు ముందు సిటీ సివిల్ కోర్టులోనూ ఇదే అనుభవం ఎదరయింది. తాజాగా హైకోర్టులోనూ ఊరట లభించలేదు. సోనూ సూద్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి పృథ్వీరాజ్ చవాన్ కొట్టివేశారు.
జుహూలోని ఆరంతస్తుల భవనాన్ని ఎలాంటి అనుమతులు లేకుండానే హోటల్‌గా మార్చారంటూ బీఎంసీ గత ఏడాది అక్టోబరులో నోటీసులు పంపింది. ఆ నోటీసులను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు సోనూసూద్. ఐతే ఆయన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
అంతేకాదు సోనూ సూద్‌పై బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఇటీవల పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. జుహూ ప్రాంతలో ఉన్న తన ఆరంతస్తుల భవాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా హోటల్‌గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర రీజియన్ అండ్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. ఆయన పాత నేరస్తుడని.. నేరాలు చేయడం అలవాటుగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఐతే బీఎంసీ ఆరోపణలను సోనుసూద్ తీవ్రంగా ఖండించారు. నివాస భవనాన్ని హోటల్‌గా మార్చేందుకు బీఎంసీ నుంచి 'చేంజ్ ఆఫ్ యూజర్' అనుమతులు తీసుకున్నానని స్పష్టం చేశారు. ఐతే ఈ కేసులో హైకోర్టులోనూ ఊరట దక్కకపోవడంతో సోనూసూద్ తదుపరి చర్య ఏంటనే దానిపై చర్చ సాగుతోంది.