సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 12 నవంబరు 2017 (15:00 IST)

ఢిల్లీ పొల్యూషన్ : బేసి - సరి విధానానికి ఎన్జీటీ బ్రేక్

కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా సోమవారం నుంచి అమలు చేయతలపెట్టిన బేసి-సరి పథకాన్ని ఉపసంహరిస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఈ పథకంలో కొన్ని రకాల వాహనాలకు ప్రభుత్వం మినహాయింపునివ్వడాన్ని జాతీయ హరిత

కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా సోమవారం నుంచి అమలు చేయతలపెట్టిన బేసి-సరి పథకాన్ని ఉపసంహరిస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఈ పథకంలో కొన్ని రకాల వాహనాలకు ప్రభుత్వం మినహాయింపునివ్వడాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) వ్యతిరేకించడంతో ప్రభుత్వం పూర్తిగా పథకాన్నే ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది. 
 
గత కొన్ని రోజులుగా ఢిల్లీ నగరంలో గాలి పూర్తిగా కలుషితమై పోయింది. దీంతో ఈనెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా బేసి - సరి విధానాన్ని అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం భావించింది. అయితే, ఈ పథకం కింద ద్విచక్రవాహనాలకు, మహిళలు మాత్రమే ప్రయాణించే వాహనాలకు, ప్రభుత్వ వాహనాలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. దీనిపై ఎన్జీటీ శనివారం ఉత్తర్వులు జారీచేస్తూ వ్యక్తులకు, అధికారులకు, ద్విచక్రవాహనదారులకు ఎటువంటి మినహాయింపునివ్వకుండా పథకాన్ని అమలు చేయాలని పేర్కొంది. 
 
నగరంలో కాలుష్య స్థాయి ఎప్పుడు నిర్దిష్ట పరిమితిని దాటినా వెంటనే ఎటువంటి లోపాలు లేకుండా బేసి-సరి పథకాన్ని అమలు చేయాలని ఆదేశించింది. ఎమర్జెన్సీ వాహనాలు, అంబులెన్స్‌లు, అగ్నిమాపకశకటాలకు తప్ప ఇతరులెవరికీ మినహాయింపునివ్వరాదని తేల్చిచెప్పింది. 
 
ఎన్జీటీ ఆదేశాలపై ఢిల్లీ రవాణా మంత్రి కైలాశ్ గెహ్లాట్ మాట్లాడుతూ, మహిళల భద్రత విషయంలో రాజీపడేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టంచేశారు. ఎన్జీటీ నిర్ణయాలను తాము గౌరవిస్తున్నామని, అయితే మహిళలను, ద్విచక్రవాహనాలను కూడా పథకం నుంచి మినహాయించరాదన్న ఆదేశాలను తాము అమలు చేయలేమని, అందువల్ల ఈ సోమవారం నుంచి అమలు చేయతలపెట్టిన బేసి-సరి పథకాన్ని ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు.