శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2019 (13:38 IST)

వాళ్ళను చూసి సిగ్గు తెచ్చుకోండి.. యూపీ ఖాకీలకు మాయావతి సలహా

పశువైద్యురాలు దిశ అత్యాచార, హత్య కేసుతో సంబంధం ఉన్న నిందితులను తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ చర్యపై దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు. అలాగే, బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి కూడా స్పందించారు. హైదరాబాద్ పోలీసులను చూసి ఉత్తరప్రదేశ్ పోలీసులు చాలా నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. 
 
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పట్ల అత్యాచారాలు పెరిగిపోయాయని పోలీసులంటే కూడా భయం లేని పరిస్థితి నెలకొని ఉందని ఆమె అన్నారు. హైదరాబాద్ పోలీసులు దిశ హత్య కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన వెంటనే మాయావతి స్పందించారు. హైదరాబాద్ పోలీసులకు ఆమె పూర్తి మద్దతు తెలిపారు. ఉత్తర ప్రదేశ్ పోలీసులతో బాటు, ఢిల్లీ పోలీసులు కూడా హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలని ఆమె హితవు పలికారు. 
 
మహిళలపై అత్యాచారాలు చేసే వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వాలు అతిథుల్లా చూస్తున్నాయని ఈ పరిస్థితి మారాలని మాయావతి ఆకాంక్షించారు. ఉత్తర ప్రదేశ్‌లో ఇదే జరుగుతున్నదని ఆటవిక రాజ్యం అక్కడ నడుస్తున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
దిశ హత్య కేసులో నిందితులకు ఉరి శిక్ష వేయాలని తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ రేఖా శర్మ అన్నారు. పోలీసులు మంచి న్యాయ నిర్ణేతలని, దిశ హత్య కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం పై ఆమె వ్యాఖ్యానించారు. అక్కడ పరిస్థితులను బట్టి పోలీసులు ఆ విధంగా ప్రవర్తించి ఉంటారని రేఖా శర్మ అభిప్రాయపడ్డారు.