గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2023 (11:08 IST)

కర్నాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే ఏపీకి తీవ్ర నష్టం!

budget
కర్నాటక రాష్ట్రంలో ఈ యేడాది ఆఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్‌లో కర్నాటక రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ముఖ్యంగా, కర్నాటకలోని అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పించారు. అలాగే, ఏకంగా రూ.5,300 కోట్ల నిధులను కేటాయించారు. 
 
ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం కలుగుతుంది. రాష్ట్ర ప్రయోజనాలకు అపారనష్టం కలిగించే ఈ ప్రాజెక్టును నిలువరించేందుకు ఏపీలోని వైకాపా ప్రభుత్వం లేదా ఆ పార్టీకి చెందిన ఎంపీలు గానీ వీసమెత్తు కూడా కృషి చేయలేదు. పైగా, రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కినా నిధులు మాత్రం చిక్కడం లేదు. ఎపుడో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అటకెక్కించింది. 
 
అలాగే, ఈ ప్రాజెక్టు కోసం కనీసం నిధులను కూడా తీసుకుని రాలేకపోయింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే మరో రూ.25 వేల కోట్లు కావాల్సి వుంది. అంటువంటి పరిస్థితుల్లో కేంద్ర కేవలం రూ.478 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ పోలవరం నిధులపై మాట్లాడినట్టు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. 
 
కానీ, ఒక్క పైసా కూడా కేంద్రం విదల్చలేదు. మరోవైపు, పోలవరం ప్రాజెక్టుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన నిధులు, అవసరమైన నిధులతో పోల్చితే ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి మరో 50 యేళ్ళు పడుతుంది. ఇది వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తే పోలవరం పూర్తి చేయడం సాధ్యమేనా అనే ప్రశ్న వినిపిస్తుంది.