సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (09:16 IST)

నవంబర్‌, డిసెంబర్‌లలో జాగ్రత్త: కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరిక

అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో కరోనా మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు. జన సమూహాలకు దూరంగా ఉండాలని, పండుగలను వర్చువల్‌గా జరుపుకోవాలని కోరారు. సెకండ్‌ వేవ్‌ ఇంకా అయిపోలేదని, కరోనా వైరస్‌ పరిస్థితి స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ దేశంలో రోజుకు దాదాపు 20వేల కేసులు వస్తున్నాయని గుర్తు చేశారు.
 
''ప్రస్తుతం కొవిడ్‌ స్థిరంగా కొనసాగుతున్న పరిస్థితిని తేలిగ్గా తీసుకోలేం. కరోనా మహమ్మారి కొనసాగుతోందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం జాగ్రత్తగా ఉండకపోతే కరోనా వైరస్‌ పరిస్థితి అవాంఛనీయ మలుపు చోటుచేసుకొనే అవకాశం ఉంది. అందువల్ల ఈ మూడు నెలల పాటు అప్రమత్తంగా ఉండాలి.

జన సమూహాలకు, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. వేడుకలను వర్చువల్‌గా జరుపుకోవడం, ఇంట్లోనే ఉండటం, ఆన్‌లైన్‌ షాపింగ్‌లకు ప్రాధాన్యమివ్వడం వంటి చర్యలు కొనసాగించాలి'' అని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ విజ్ఞప్తిచేశారు.
 
గత వారంలో నమోదైన మొత్తం కొవిడ్‌ కేసుల్లో 50శాతం కేరళలోనే నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. 'కేరళలో ప్రస్తుతం లక్షకు పైగా క్రియాశీల కేసులు ఉన్నాయి. 10వేల నుంచి 50వేల మధ్య క్రియాశీల కేసులు నాలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి.

తొమ్మిది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 34 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10శాతం కన్నా అధికంగా ఉంది. అలాగే, 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 28 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 5నుంచి 10శాతంగా ఉంది.