నేడు జాబిలమ్మపైకి చంద్రయాన్... నిగూఢ రహస్యాల ఛేదన కోసం...
చందమామలోని రహస్యాలను ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రయాన్-3 ప్రాజెక్టును చేపట్టింది. అంతరిక్ష ప్రయోగ రంగంలో భారత కీర్తి ప్రతిష్ఠల్ని మరింత ఇనుమడింపజేసి.. స్వదేశీ పరిజ్ఞానంపై మన నమ్మకాన్ని మరింత పెంచే మూన్ మిషన్‌కు సర్వం సిద్ధం చేసింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించే చంద్రయాన్ 3 ప్రయోగాన్ని శుక్రవారం చేపట్టనుంది.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) ఈ ప్రయోగానికి వేదికకానుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ గురువారం మధ్నాహ్నం 1.05 గంటలకు ప్రారంభమైంది. ఈ కౌంట్‌డౌన్ 25.30 గంటల పాటు నిరాటంకంగా కొనసాగిన ఆనంతరం బాహుబలి రాకెట్ ఎల్ వీఎం - ఎండి శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లనుంది.
మొదట 24 గంటల కౌంట్‌డౌన్ ప్రారంభించాలని శాస్త్రవేత్తలు భావించారు. కానీ, స్వల్పమార్పులు చేసి కౌంట్ డౌన్‌ను 25.30 గంటలకు పెంచి ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ రాకెట్ ద్వారా 3,900 కిలోల బరువున్న చంద్రయాన్-3 పేలోడ్‌ను రోదసీలోకి పంపనున్నారు. రాకెట్ నుంచి విడిపోయాక వ్యోమనౌకను భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్య వరకూ మోసుకెళ్లే ప్రొపల్షన్ మాడ్యూల్, అక్కడి నుంచి చంద్రునిపై దిగిన తర్వాత పరిశోధనలు చేసేందుకు విక్రమ్ ల్యాండర్, ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేపట్టే ప్రగ్యాన్ రోవర్ చంద్రయాన్‌లో ఉన్నాయి.