శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (12:54 IST)

చంద్రమండలంపై విక్రమ్ ల్యాండర్ - ప్రజ్ఞాన్ రోవర్‌ను నిద్ర లేస్తాయా?

Chandrayaan 3
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టు విజయవంతంగా ముగిసింది. అయితే, ఈ ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి సౌత్ పోల్‌పై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు 14 రోజుల పాటు పని చేసి ఆ తర్వాత నిద్రాణ స్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రుడిపై మరో రెండు రోజుల్లో సూర్య ప్రకాశం రానుంది. దీంతో ల్యాండర్, రోవర్‌లు నిద్రాణస్థితి నుంచి బయటకు వస్తాయా లేదా అనే అంశం ఇపుడు ఇస్రో శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
 
చంద్రమండలం దక్షిణ ధృవంపై మైనస్‌ 200 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను ఎలక్ట్రానిక్‌ పరికరాలు తట్టుకోవడం, రీఛార్జి కావడంపైనే ఇది ఆధారపడి ఉంది. చంద్రయాన్‌-3 దిగిన శివ్‌శక్తి పాయింట్‌ వద్ద పగటి సమయం ముగిసి చీకట్లు అలముకోవడంతో ఇస్రో ఈ నెల 2, 4 తేదీల్లో ల్యాండర్‌, రోవర్‌లను నిద్రాణ స్థితిలోకి పంపింది. 
 
జాబిల్లి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన వాటిని 14 రోజులు పనిచేసేలా రూపొందించారు. ల్యాండింగ్‌ ప్రాంతంలో సూర్యోదయం కోసం మరో రెండు రోజులు వేచిచూడాల్సి ఉందని, ఈ నెల 22 తర్వాత రోవర్‌, ల్యాండర్‌లను మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ రెండూ పని చేయడం ప్రారంభిస్తే మరో 14 రోజులు వాటి సేవలు అందుబాటులో వస్తాయి. అదే జరిగిత ఇస్రోకు అది బోనస్ అవుతుంది. పైగా, ఇదే జరిగితే అంతరిక్ష పరిశోధనలో ఇస్రో సరికొత్త శకానికి నాదిపలికినట్టే.