గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 అక్టోబరు 2020 (10:28 IST)

తమిళనాడు ముఖ్యమంత్రి ఈపీఎస్‌కు ఎమ్మెల్యే రోజా పరామర్శ

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామికి ఇటీవలే మాతృవియోగం జరిగింది. ఆయన తల్లి తవసాయమ్మ ఇటీవల కన్నుమూశారు. అయితే, ఏపీలోని నగరి ఎమ్మెల్యే, సినీ నటితి, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే.రోజా చెన్నైకు చేరుకుని సీఎం ఎడప్పాడి తల్లి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎడప్పాడిని పరామర్శించారు. 
 
అలాగే, సీఎంను పరామర్శించి, సానుభూతి తెలియజేయడానికి రాజకీయాలకు అతీతంగా నేతలు గ్రీన్‌వేస్‌ రోడ్డులోని పళనిస్వామి ఇంటికి వెళ్లి వస్తున్నారు. మంగళవారం ఎండీఎంకే నేత వైగో, సీపీఐ నేత ముత్తరసన్, సినీ నటి, బీజేపీ నేత కుష్బూ, డీఎండీకే నేత సుధీప్‌, సినీ నిర్మాత ఆర్‌బీ చౌదరి పళనిస్వామిని కలిసి సానుభూతి తెలిపారు. 
 
బుధవారం ఆర్కే రోజా తన భర్త ఆర్కే సెల్వమణితో కలసి సీఎం నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత తవసాయమ్మ చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించారు. కొంతసేపు పళనిస్వామితో మాట్లాడి తన సానుభూతి తెలియజేశారు.  
 
ఇదిలావుంటే, పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం డీజీపీ కార్యాలయ ఆవరణలో పోలీసు అమరవీరులకు వందనం సమర్పించే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని ఇప్పటివరకు విధుల్లో అమరులైన పోలీసుల పేర్లు, వివరాలను పొందు పరుస్తూ డీజీపీ కార్యాలయం ఆవరణలో శిలాఫలకాన్ని రూపొందించారు. 
 
దీనిని సీఎం పళనిస్వామి ఆవిష్కరించారు. అలాగే, అక్కడ ఓ మొక్కను నాటారు. డీజీపీ కార్యాలయంలో పోలీసుల అధికారులతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఉప సీఎం పన్నీరుసెల్వం, మంత్రులు జయకుమార్, ఎస్పీ వేలుమణి, హోంశాఖ కార్యదర్శి ప్రభాకర్, డీజీపీ త్రిపాఠి, చెన్నై పోలీసుకమిషనర్‌ మహేశ్‌కుమార్‌ అగర్వాల్‌ పాల్గొన్నారు.