బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 అక్టోబరు 2020 (14:07 IST)

ఆ బిల్లులు రైతులకు 'గోరుచుట్టుపై రోకలి పోటు' వంటివే : కె.రామకృష్ణ

తెలుగు ప్రజలను ఉత్తేజ పరిచేరీతిలో "ద్రావిడ దేశం" తరపున అనేక కార్యక్రమాలను అంతర్జాలమూలం ఆధారంగా నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా, "యువత, కార్మికులు - వ్యవస్థాపకత, ఉద్యోగావకాశాలు" అనే అంశంపై ఒక కార్యక్రమాన్ని ద్రావిడ దేశం అధ్యక్షుడు వి.కృష్ణారావు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ పార్టీ కార్యదర్శి కె.రామకృష్ణ, విశ్రాంత ఐఏఎస్ అధికారి పి.కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే, పారిశ్రామికవేత్త బీద మస్తాన్ రావు, ఇండియన్ మెరైన్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ పి.విజయన్ పాల్గొని అనేక సందేశాలను, తమ అనుభవాలను పంచుకున్నారు. 
 
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వి కృష్ణారావు ప్రసంగిస్తూ ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే ఆర్థిక వనరులు, నైపుణ్యత గలిగిన ఉద్యోగస్తులతో కార్మికులందరూ భాగస్వామ్యంతో ఏ విధంగా నాణ్యమైన వస్తువులను తయారు చేస్తూ అన్ని రంగాలలో పేద వారు సైతం ఎలా అభివృద్ధి చెందాలి అనే విషయంపై వివరించారు. 
 
ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కె.రామకృష్ణ ప్రసంగిస్తూ ప్రపంచీకరణ కారణంగా ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయి పేదలు మరింత పేదలుగా అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బడా పారిశ్రామిక వేత్తలకు ప్రాముఖ్యత పెంచుతూ చిన్నచిన్న వ్యాపారస్తుల ఆర్థిక పురోభివృద్ధిపై దెబ్బతీస్తున్నారు అని అన్నారు. చివరకు వ్యవసాయ రంగంపై కూడా కార్పొరేట్ వర్గాలు గుత్తాధిపత్యం చేసే విధంగా పరిస్థితులు వచ్చాయన్నారు. 
 
కేవలం వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న 70 శాతం గ్రామీణ ప్రాంత ప్రజలు జీవనోపాధి లేక వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక ఇబ్బంది పడుతూ జీవనోపాధికై వలస కార్మికులుగా మారుతున్నారు అని చెప్పారు. ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ బిల్లులు రైతులకు గోరుచుట్టుపై రోకలి పోటులా ఉందన్నారు. 
 
రిజర్వు బ్యాంకు తీసుకున్న నిర్ణయాలు కూడా మధ్యతరగతి వారికి ఇబ్బందికరంగా ఉన్నాయని చిన్న చిన్న పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని కల్పించి తద్వారా కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తోడ్పడాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా బడా కార్పొరేట్ వర్గాలకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈ పరిస్థితి మారాలని అన్నారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల పెట్టుబడుల సంస్థ మాజీ ఛైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి పి.కృష్ణయ్య ప్రసంగిస్తూ
 భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ఏర్పాటు చేయుట ద్వారా ఆర్థికంగా, ఉద్యోగ పరంగా అందరికీ అవకాశాలు ఉంటాయని అన్నారు. నైపుణ్యాభివృద్ధి అంశంపై ప్రభుత్వాల వారు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి చదువులతో నిమిత్తం లేకుండా ప్రజలను పరిశ్రమలలో భాగస్వామ్యం చేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించవచ్చు అని అన్నారు.
 
ఇటీవల కరోనా లాక్డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు పడిన కష్టాలను దృష్టిలో పెట్టుకొని కార్మిక చట్టాలు అమలు పరిచి అందరికీ కనీస వేతనాలు పొందే సౌకర్యం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కల్పించాలని కోరారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులో ఉందని ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను ఒక్క క్షణంలో తెలుసుకునే అవకాశాలున్నాయని దానిని అధ్యయనం చేసి యువతీ యువకులు అందుబాటులో ఉన్న అనేక రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత మీద అవగాహనతో మంచి ఆహారపు అలవాట్లు చేసుకుంటున్నారని దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులు ఆర్గానిక్ పంటలపై దృష్టి సారించి పెట్టుబడులను మించి మంచి లాభాలను పొందవచ్చని అన్నారు. 
 
ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు ప్రసంగిస్తూ ప్రస్తుతం దేశంలో మధ్యతరం ప్రజానీకానికి తగిన ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందని, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధి సంస్థ ద్వారా అభివృద్ధి పరిచిన అనేక లేఔట్లలో చాలా స్థానాలు ఖాళీగా ఉన్నాయని వాటి ని చిన్నచిన్న పెట్టుబడిదారులకు అందుబాటులోకి తీసుకువచ్చి పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటునివ్వవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రస్తుతం ప్రైవేట్ పరిశ్రమాభివృద్ధికి అనేక సమృద్ధి అవకాశాలు ఉన్నాయని వాటిని అందరూ ఉపయోగించుకొని ఆర్థిక అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు.
 
చేపల పరిశ్రమలోను, కుటీర పరిశ్రమలలోను అనేక వ్యాపార అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకోవలసిన ఆవశ్యకత యువతరంపై ఉందన్నారు. యువ పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే వారికి తోడ్పాటు నిచ్చే రీతిలో తమ బి.ఎం.ఆర్.గ్రూప్ సంస్థల తరఫున ఒక కోటి రూపాయలు భాగస్వామ్య పెట్టుబడికి తాము సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కూడా యువ పారిశ్రామికవేత్తలకు తగిన ప్రోత్సాహం అందించి తోడ్పాటు అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.
 
ఇంకా ఈ కార్యక్రమంలో ఇండియన్ మెరైన్ విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి డాక్టర్ పి. విజయన్‌తో పాటు తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుండి అనేకమంది పారిశ్రామికవేత్తలు పాల్గొని తమ అనుభవాలను ఈ సమావేశంలో పంచుకున్నారు.