భారత వాయుసేన చేతికి చినూక్ హెలికాప్టర్‌లు..
రాత్రి వేళల్లోనూ మిలిటరీ ఆపరేషన్స్‌లో పాల్గొనేందుకు వీలుగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి మరో అస్త్రం వచ్చి చేరింది. దీంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బలం మరింత పెరిగింది. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో, భారీ ఎత్తున సాయుధ బలగాలు, ఆయుధాలను మోసుకెళ్లగలిగే చినూక్ హెలికాప్టర్‌లు ఎయిర్‌ఫోర్స్ చేతికి చిక్కాయి. ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా చంఢీగడ్‍లో వీటి రాకను ప్రకటించారు.
తొలి విడతగా నాలుగు హెలికాప్టర్‌లు వచ్చాయని, అలాగే ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న వివిధ భద్రతా సవాళ్ల నేపథ్యంలో చినూక్‌లాంటి హెలికాప్టర్‌లు అవసరమని బీఎస్ ధనోవా పేర్కొన్నారు. రాత్రి వేళల్లోనూ మిలిటరీ ఆపరేషన్స్ చేయగలిగే సత్తా ఈ చినూక్ హెలికాప్టర్‌ల సొంతం అని, మన భారత రక్షణ అవసరాలకు అనుగుణంగా వీటిలో మార్పులు చేసినట్లు ధనోవా వెల్లడించారు.
రాఫెల్ ఫైటర్ జెట్స్ ఎలాగైతే భారత రక్షణ రంగాన్ని పటిష్టపరచనున్నాయో.. అదే విధంగా చినూక్ హెలికాప్టర్‌లు కూడా అంతేనని ఆయన స్పష్టం చేసారు. ఈ చినూక్ హెలికాప్టర్‌లు హిమాలయాలు వంటి అత్యంత ఎత్తైన ప్రదేశాలకు భారీ పేలోడ్స్‌ను మోసుకెళ్లగలవు.
బోయింగ్ నుంచి ఆదివారమే ఈ నాలుగు హెలికాప్టర్‌లు ఇండియాకు వచ్చాయి. అత్యంత కఠినమైన పరిస్థితుల్లోనూ పరీక్షించిన తర్వాతే ఈ హెలికాప్టర్లను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేతికి ఇచ్చారు. ప్రస్తుతం 19 దేశాలు ఈ చినూక్ హెలికాప్టర్‌లను వాడుతున్నాయి.