అయోధ్యలో సీఎం యోగి పూజలు
ఆగస్టు 5న ప్రతిష్ఠాత్మక రామమందిర నిర్మాణానికి శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యను సందర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ కార్యక్రమానికి హాజరవుతున్న వేళ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన ఆయన.. రామ జన్మభూమిలో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమ సన్నద్ధతపై ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు అధికారులు, మత పెద్దలతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ అయోధ్యకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. అయోధ్యను మనం దేశానికి, ప్రపంచానికి గర్వకారణంగా తీర్చిదిద్దాలి.
పరిశుభ్రత అనేది మన తొలి షరతు కావాలి. స్వీయ క్రమశిక్షణ ద్వారా అయోధ్యకు తన సామర్థ్యాన్ని నిరూపించుకొనే అవకాశం వచ్చింది’’ అని యోగి అన్నారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో భౌతికదూరం నిబంధనలు అమలులో ఉండటంతో రామ జన్మభూమి కాంప్లెక్స్‌లో భూమిపూజ కార్యక్రమానికి 150 నుంచి 200 మంది మాత్రమే హాజరుకానున్నారు. శంకుస్థాపన అనంతరం మూడేళ్లలోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ఆగస్టు 5న ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరగనుండగా.. ఆగస్టు 3 నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయోధ్య ప్రజలు తిలకించేందుకు వీలుగా భారీ సీసీటీవీ స్క్రీన్‌లు ఏర్పాటు చేయనున్నట్టు రామజన్మభూమి తీర్ధ క్షేత్రం వెల్లడించింది.