కాంగ్రెస్ హయాంలోనే అవినీతి పురుడుపోసుకుంది.. హర్యానాలో ప్రధాని ఫైర్
దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి పురుడుపోసుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. హర్యానాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ పార్టీ హర్యానాను వారి వారసులకు, మధ్యవర్తులకు అప్పగించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా.. బంధుప్రీతి స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.
ప్రస్తుతం భాజపా ప్రభుత్వ హయాంలో వ్యవసాయ, పరిశ్రమల రంగాల్లో దేశం అగ్రస్థానంలో ఉందని ప్రధాని పేర్కొన్నారు. పారిశ్రామిక వృద్ధితోనే దళితులు, పేదల సాధికారత ముడిపడి ఉందని అంబేద్కర్ పేర్కొన్నారని తెలిపారు.
ఇకపోతే.. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ఓ బాలుడు తాను గీసిన మోదీ చిత్రాన్ని చూపుతుండటం ఆయన గమనించారు. తన చిరునామా రాసి, ఆ చిత్రాన్ని భద్రతా సిబ్బందికి అందించాలని బాలుడిని కోరారు.
మరోవైపు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతులకు భాజపా ద్రోహం చేసిందని.. వారు తమ సమస్యలను చెప్పుకోవడానికి వస్తే పోలీసులతో లాఠీచార్జ్ చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ సర్కార్‌పై హరియాణా రైతులు పూర్తిగా నమ్మకం కోల్పోయారని పేర్కొన్నారు.
90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానా శాసనసభకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుండగా.. జమ్మూకశ్మీర్‌తో పాటే అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడించనున్నారు.