బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 3 మార్చి 2021 (11:29 IST)

ఒకే మఠంలో 150 మంది భిక్షువులకు కరోనా

ధర్మశాలలోని ప్రముఖ గ్యుటో మఠంలో 150 మంది బౌద్ధ భిక్షువులకు కరోనా సోకినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఈ మఠం ఉంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఈ మఠంలో పెద్ద ఎత్తున కేసులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

‘‘ఇప్పటి వరకు కాంగ్రా జిల్లాలో 330 మంది బౌద్ధ భిక్షువులకు కరోనా సోకింది. వారిలో 154 మంది గ్యుటో మఠానికి చెందిన వారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో  వైద్యకళాశాలకు తరలించి చికిత్సనందిస్తున్నాం. మిగిలిన వారిని మఠంలోనే ఐసోలేషన్‌లో ఉంచాం.’’ అని కాంగ్రా ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ గురుదర్శన్‌ గుప్తా తెలిపారు.

ఈ బౌద్ధ భిక్షువులు ఇటీవల ఎక్కడికీ వెళ్లలేదని ఆయన తెలిపారు. కానీ నూతన సంవత్సరం సమయంలో కొందరు దిల్లీ, కర్ణాటక ప్రాంతాలకు వెళ్లినట్లు గుర్తించామని తెలిపారు. కరోనా తీవ్రత దృష్ట్యా మార్చి 5 వరకు మఠంలోకి సందర్శకులను అనుమతించట్లేదని అధికారులు వెల్లడించారు.

ఇప్పటి వరకు హిమాచల్‌ప్రదేశ్‌లో 58,777 కరోనా కేసులు నమోదవ్వగా, 996 మరణాలు సంభవించాయి. మంగళవారానికి క్రియాశీల కేసుల సంఖ్య 434గా ఉంది.