బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : సోమవారం, 1 మార్చి 2021 (11:00 IST)

కరోనా థర్డ్‌ వేవ్‌ మరింత ప్రమాదకరం: సీఎస్‌ఐఆర్‌

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని, కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే మూడో దఫా (థర్డ్‌ వేవ్‌) ప్రమాదం పొంచి ఉందని కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌, ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ శేఖర్‌ సి మండే స్పష్టంచేశారు. కరోనా వైరస్‌ కట్టడిని నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని  ఆయన హెచ్చరించారు.
 
ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడేందుకు అన్ని వ్యవస్థలూ కలిసికట్టుగా పోరాడాలని సీఎస్‌ఐఆర్‌ డీజీ అభిప్రాయపడ్డారు. యావత్‌ మానవాళిపై తీవ్ర ప్రభావం చూపే పర్యావరణ మార్పులు, శిలాజ ఇంధనాల వాడకంపై తీవ్రంగా ఆధారపడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించే దాఖలాలు ప్రస్తుతం భారత్‌లో సమీప భవిష్యత్‌లో కనిపించడం లేదన్న ఆయన.. వైరస్‌ దరిచేరకుండా ఉండేందుకు మాస్కులు, భౌతికదూరం, వ్యక్తిగత శుభ్రతను పాటించాలని సూచించారు.

కరోనా వైరస్‌ ముప్పు తొలగిపోయిందని నిర్లక్ష్యం చేస్తే మూడో ముప్పు (థర్డ్‌ వేవ్‌) వల్ల భారత్‌ ఇప్పటివరకు ఎదుర్కొన్న సవాళ్ల కంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని హెచ్చరించారు.

ప్రస్తుతం భారత్‌లో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు కొత్తరకం కరోనాపైనా పనిచేసే అవకాశం ఉందని మండే అభిప్రాయపడ్డారు. కొత్తరకంపై పనిచేయవని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలూ ప్రస్తుతం లేవని.. అందుచేత వ్యాక్సిన్‌ల సామర్థ్యంపై నమ్మకం ఉంచాలని స్పష్టంచేశారు.