బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (10:52 IST)

తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా?

కరోనా మళ్లీ తన పంజా విప్పుతోంది. ఒకప్పుడు మహారాష్ట్రను గడగడలాడించిన మహమ్మారి ఇప్పుడు అక్కడ తిరిగి విజృంభిస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో మహారాష్ట్రలో ప్రతిరోజూ 3,000 పైచిలుకు కేసులు నమోదయ్యాయి.

తొలివారంతో పోలిస్తేనే 14 శాతం అధికంగా కరోనా కేసులు వస్తున్నాయి. ముంబై, పుణే నగరాల్లో ప్రతిరోజు 600 పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఒక అపార్ట్‌మెంట్‌లో సోమవారం 28 కేసులు నమోదు కాగా, మంగళవారం ఆ సంఖ్య 103కు పెరిగింది.

మరోవైపు కేరళలోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. కేరళ నుంచి వచ్చేవారు తాజా కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ (ఆర్‌టీపీసీఆర్‌)తో వస్తేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామని కర్ణాటక మంగళవారం ప్రకటించింది.
 
ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో మనకు సరిహద్దు ఎక్కువగా ఉంది. కేరళతో విస్తృత సంబంధాలున్నాయి. అక్కడకు చెందిన అనేకమంది నర్సులు, టీచర్లు మన రాష్ట్రంలో పనిచేస్తుంటారు.

ఇక మహారాష్ట్ర నుంచి సరిహద్దు జిల్లాలకు రోజువారీ రాకపోకలు జరుగుతాయి. ఈ రాష్ట్రాలకు నిత్యం అనేక విమాన సర్వీసులు నడుస్తాయి. రోజూ వేలాది మంది వస్తూ పోతుంటారు. దీంతో తెలంగాణ ప్రజలు అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.