గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (20:36 IST)

పశ్చిమ బెంగాల్‌లో కరోనా సీక్రెట్

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కరోనా కేసుల్ని దాచేస్తోందా? .. ఉద్దేశపూర్వకంగా నే పరీక్షలు చేయడం లేదా?... అవుననే అంటున్నాయి పలు ఏజెన్సీలు. అస్సాం కన్నా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం జనాభా మూడింతలు ఎక్కువ. అయితే ఏప్రిల్‌ 20వ తేదీ నాటికి ఇరు రాష్ట్రాల్లో ప్రజలపై కోవిడ్‌–19 పరీక్షలు జరిపిన సంఖ్య మాత్రం దాదాపు సమానమే.

అస్సాంలో 5,112 మందిపై కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించగా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో 5,469 మందిపై పరీక్షలు నిర్వహించారు. ఎంత మంది జనాభాకు ఎన్ని పరీక్షలు నిర్వహించారనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలనుకుంటే పది లక్షల మందిలో 163 మందికి అస్సాంలో పరీక్షలు నిర్వహించగా, పది లక్షల మందిలో కేవలం 60 మందికి మాత్రమే పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహించారు.

జాతీయ స్థాయిలో ఈ సంఖ్య సరాసరిగా 317గా ఉంది. అంటే పశ్చిమ బెంగాల్‌లో అతి తక్కువగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా ప్రపంచ దేశాలకన్నా, పొరుగు రాష్ట్రమైన బీహార్‌కన్నా మరీ తక్కువ.
 
సాధారణంగా తక్కువ మంది ప్రజలపై కరోనా పరీక్షలు జరిపినట్లయితే కరోనా కేసులు తక్కువగా నమోదు కావాలి. బీహార్‌లో కేవలం 96 కేసులు బయటపడగా, బెంగాల్‌లో 339 కేసులు నమోదుకాగా, 20 మంది చనిపోయారు. ప్రతి 16 శాంపిల్స్‌లో ఒకటి పాసిటీవ్‌గా తేలింది.

జాతీయ స్థాయిలో ఈ సంఖ్య 26గా ఉంది. దీన్ని బట్టి పశ్బిమ బెంగాల్‌లో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘పరీక్షల సంఖ్య తక్కువగా ఉండి. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం సానుకూల వైఖరని ప్రదర్శించడం లేదని అర్థం అవుతుంది’ అని ‘పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా’ నిర్వహిస్తోన్న లైఫ్‌ కోర్స్‌ ఎపిడమాలోజీ విభాగం అధిపతి వ్యాఖ్యానించారు.

కరోనా పరీక్షలు నిర్వహించడంలో భారత వైద్య పరిశోధనా మండలి నిర్దేశించిన మార్గదర్శకాలను కూడా బెంగాల్‌లోని రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి, కోల్‌కతాలోని టెరిటరీ ఆస్పత్రిలో పని చేస్తోన్న డాక్టర్‌ మనాస్‌ గుప్తా ఆరోపించారు. 

‘బెంగాల్‌ ప్రజలు అగ్ని పర్వతం మీద కూర్చున్నారు. అది ఏ క్షణంలోనైనా పేలిపోవచ్చు’ అని డాక్టర్ల సంఘం తరఫున తృణమూల్‌ ప్రభుత్వానికి ఈ నెల 14వ తేదీన రాసిన ఓ లేఖలో గుప్తా హెచ్చరించారు. కరోనా బాధితుల కుటుంబ సభ్యులతోపాటు వారి సన్నిహితులకు విధిగా కరోనా పరీక్షలు నిర్వహించాలని, అంతగా కరోనా సోకే అవకాశం లేని బంధువులను, మిత్రులను క్వారెంటైన్‌లో ఉంచాలని ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు విడుదల చేసింది.

అయితే వాటిని తృణమూల్‌ ప్రభుత్వం పాటించడం లేదని గుప్తా ఆరోపించారు. కరోనా సోకే ప్రమాదం ఉన్న వైద్య సిబ్బందికి కూడా ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలని ఐసీఎంఆర్‌ నిర్దేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.

కరోనా బారిన పడిన బాధితుల సంబంధీకులను గుర్తించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని మరో ప్రముఖ ఎపిడిమియాలోజిస్ట్‌ ఆరోపించారు.