శనివారం, 22 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 22 ఫిబ్రవరి 2025 (13:31 IST)

జీఎస్టీ అధికారి నివాసంలో మిస్టరీ మరణాలు!!

deadbody
కేరళ రాష్ట్రంలో ఓ జీఎస్టీ అధికారి నివాసంలో మూడు మృతదేహాలు వెలుగు చూశాయి. జీఎస్టీ అధికారితో పాటు ఆయన తల్లి, సోదరిలు శవాలై కనిపించారు. ఈ ఘటన సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత హోదాలో ఉన్న ఓ ఉన్నతాధికారి ఇంట్లో మూడు మృతదేహాలు లభ్యం కావడం ఇపుడు చర్చనీయాశంగా మారింది. 
 
జాతీయ మీడియాలో వస్తున్న కథనాల మేరకు... కొచ్చిలో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ జీఎస్టీ విభాగంలో మనీశ్ విజయ్ అడిషినల్ కమిషనరుగా పని చేస్తున్నారు. ఆయన తాజాగా నాలుగు రోజుల పాటు సెలవు పెట్టారు. అవి పూర్తయిన తర్వాత కూడా తిరిగి విధుల్లోకి రాలేదు. దాంతో మనీశ్‌కు కలిసేందుకు స్నేహితులు ఎర్నాకుళం జిల్లాలోని అతని క్వార్టర్స్‌కు వెళ్ళి చూశారు. కానీ అక్కడకు వెళ్ళగానే దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు.
 
ఆ వెంటనే పోలీసులు వచ్చి తలుపులు తీయగా, మనీశ్ ఒక గదిలో ఆయన సోదరి షాలిని మరో గదిలో ఉరికి వేలాడుతూ కనిపించారు. ఇంకో గదిలో ఆయన తల్లి నిర్జీవంగా పడివున్నారు. ఈ మృతదేహాన్ని మాత్రం తెల్లని వస్త్రంలో చుట్టి పూలు చల్లినట్టుగా ఉంది. పక్కనే వీరు ముగ్గురూ దిగిన ఫోటో ఉంది. ఈ ఘటన అనుమానాలకు దారితీసింది. తల్లి ముందుగానే చనిపోయివుండొచ్చని, లేకపోతే ముందే చంపేసి వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడివుంటారని పోలీసులు భావిస్తున్నారు. 
 
వీరంతా కొద్ది రోజుల క్రితమే మరణించివుంటారని కొచ్చిన్ పోలీస్ కమిషనర్ చెపుతున్నారు. అలాగే, ఓ గదిలో డైరీని కూడా గుర్తించారు. విదేశాల్లో ఉన్న తమ సోదరికి సమాచారం ఇవ్వాలని ఇంట్లో ఉన్న అన్ని పత్రాలను ఆమెకు అందించాలని కేరళ పోలీసులను ఉద్దేశించి వారు డైరీలో పేర్కొన్నట్టు సమాచారం. అయితే, జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగు చూసిన పీఎస్సీ స్కామ్‌లో మనీశ్ విజయ్ సోదరి షాలిని సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నట్టు సమాచారం. అందుకే వీరు ఆత్మహత్యకు పాల్పడివుంటారని పోలీసులు సందేహిస్తున్నారు.