శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జెఎస్కె
Last Updated : బుధవారం, 28 జులై 2021 (18:49 IST)

క‌ట్నం తీసుకోలేద‌ని పెళ్ల‌యిన నెల రోజుల్లో డిక్ల‌రేష‌న్

ఈ నిబంధ‌న వింటే పెళ్ళి వారు ప‌రార‌యిపోతారు... అవును... వరకట్నం విషయంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేరళలో ప్రభుత్వ ఉద్యోగులు పెళ్లి చేసుకుంటే, నెల రోజుల్లోపు ‘‘ఎలాంటి కట్నం తీసుకోలేదు’’ అని డిక్లరేషన్ ఇవ్వాలి. సదరు డిక్లరేషన్ పై పెళ్లికూతురు, పిల్లనిచ్చిన మామ కూడా సంతకం చేయాలని షరతు విధించింది.

కేరళ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కొద్ది రోజుల క్రితమే ఈ సర్క్యులర్ జారీ చేసింది.
వరకట్నానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం తాజాగా ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు, అటానమస్, ఇతర సంస్థలకు సంబంధించిన విభాగాల నిర్వాహకులు లేదా అధిపతులు సైతం ఈ మేరకు డిక్లరేషన్లు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

అంతే కాదు ఇకపై కేరళ రాష్ట్రంలో ప్రతి ఏడాది నవంబర్ 26న వరకట్న వ్యతిరేక దినోత్సవంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వరకట్న వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్కూల్స్‌, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులచే కట్నం తీసుకోమని ప్రతిజ్ఞ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

వరకట్నం తీసుకోమని విద్యార్థులు తమ డిగ్రీ ధృవ పత్రాలు తీసుకోవడానికి ముందు బాండ్ ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయంతో వరకట్న నిషేధం విషయంలో మరో అడుగు ముందుకేసింది.