1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 మే 2021 (19:49 IST)

కిడ్నాపర్లుగా ఖాకీలు.. దొంగను కిడ్నాప్ చేసి రూ.3 లక్షల డిమాండ్

సమాజంలో నేరాలు ఘోరాలు జరుగకుండా పహారా కాస్తూ, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే కిడ్నాపర్లుగా మారిపోయారు. వారంతా ఓ దొంగను కిడ్నాప్ చేశారు. ఆ దొంగను వదిలిపెట్టేందుకు ఏకంగా రూ.3 లక్షలను డిమాండ్ చేశారు. డబ్బు సంపాదన ఆశలో పడి ఈ నేరానికి పాల్పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీలోని జామియా నగర్ పోలీస్ స్టేషనులో దారి దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అతడిని విడిపించిన పోలీసులు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. 
 
అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏకంగా ఓ కిడ్నాప్‌కు ప్లాన్ చేశారు. తాము రక్షించిన దొంగను కిడ్నాప్ చేసి.. అతడిని పోలీస్ స్టేషన్‌లోనే దాచి పెట్టారు. అతడిని విడిచిపెట్టాలంటే రూ.3 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
 
ఈ కిడ్నాప్ ఉదతంపై దొంగ కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ విచారణలో దొంగను పోలీస్ స్టేషనులోనే దాచిపెట్టినట్టు గుర్తించారు. ఈ కేసులో రాకేష్ కుమార్ అనే హెడ్ కానిస్టేబుల్‌తో పాటు మరో ఇద్దరు ఇందులో కీలక నిందితులుగా ఉన్నారు. దీనిపై దీంతో వారు ముగ్గురినీ విధుల నుంచి తొలిగించారు. అలాగే, వారిని అరెస్టు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.