మంగళవారం, 21 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2025 (11:55 IST)

రాహుల్ జీ... దయచేసి త్వరగా పెళ్లి చేసుకోండి...

rahul gandhi
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఓ ఆసక్తికర అనుభవం ఎదురైంది. దీపావళి పండుగ సందర్భంగా పాత ఢిల్లీలోని చారిత్రక ఘంటేవాలా స్వీట్ షాప్‌కు ఆయన వెళ్లగా, ఆ షాపు యజమాని నుంచి ఊహించని విన్నపం వచ్చింది. "రాహుల్ జీ, దయచేసి త్వరగా పెళ్లి చేసుకోండి. మీ పెళ్లి స్వీట్ల ఆర్డర్ కోసం మేం ఎదురుచూస్తున్నాం" అంటూ యజమాని సుశాంత్ జైన్ చేసిన సరదా వ్యాఖ్య ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
 
సోమవారం దీపావళి సందర్భంగా రాహుల్ గాంధీ, తన స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం స్వీట్లు కొనుగోలు చేయడానికి ఈ షాపును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా స్వీట్లు తయారుచేయడానికి ఆసక్తి చూపించారు. 
 
ఈ సందర్భంగా రాహుల్‌తో షాపు యజమాని సుశాంత్ జైన్ సరదాగా ముచ్చటిస్తూ, 'రాహుల్ గారు స్వీట్లు కొనేందుకు వచ్చారు. ఇది మీ సొంత దుకాణమే అనుకోండి అంటూ నేను ఆయనకు స్వాగతం పలికాను. స్వీట్లను తానే స్వయంగా తయారుచేసి రుచి చూస్తానని ఆయన అన్నారు' అని తెలిపారు.
 
రాహుల్ తండ్రి, దివంగత రాజీవ్ గాంధీకి ఇమార్తి అంటే చాలా ఇష్టమని, అందుకే రాహుల్‌ను ఇమార్తి తయారు చేయమని కోరినట్లు జైన్ చెప్పారు. అలాగే, రాహుల్‌కు బేసన్ లడ్డూలు ఇష్టం కావడంతో వాటిని కూడా ఆయనే స్వయంగా తయారుచేశారని వివరించారు. 
 
ఈ క్రమంలోనే తాను రాహుల్‌తో సరదాగా పెళ్లి ప్రస్తావన తెచ్చినట్లు జైన్ పేర్కొన్నారు. "భారతదేశంలో అత్యంత అర్హత కలిగిన బ్రహ్మచారి రాహుల్ గారే. అందుకే, ఆయన పెళ్లి కోసం మేం ఎదురుచూస్తున్నామని చెప్పాను" అని అన్నారు.
 
కాగా, రాహుల్ గాంధీ తన పర్యటనపై కూడా ట్విట్టర్‌లో స్పందించారు. 'పాత ఢిల్లీలోని చారిత్రక ఘంటేవాలా స్వీట్ షాపులో ఇమార్తి, బేసన్ లడ్డూలు తయారుచేశాను. శతాబ్దాల నాటి ఈ షాపులోని తీపిదనం ఇప్పటికీ స్వచ్ఛంగా, సంప్రదాయబద్ధంగా మనసును హత్తుకునేలా ఉంది. అసలైన దీపావళి మాధుర్యం స్వీట్లలోనే కాదు, సంబంధాలు, సమాజంలో కూడా ఉంటుంది' అని రాహుల్ పేర్కొన్నారు. 'మీరు మీ దీపావళిని ఎలా జరుపుకుంటున్నారు?' అని ప్రజలను అడుగుతూ తన పోస్ట్‌ను ముగించారు.