గురువారం, 9 అక్టోబరు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 సెప్టెంబరు 2025 (10:52 IST)

ఆసియా క్రికెట్ కప్ : పాకిస్థాన్ విన్నపాలు గంగపాలు...

asia cup
ఆసియా క్రికెట్ కప్ టోర్నీలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు పాకిస్థాన్ చేసిన విన్నపాలు గంగపాలయ్యాయి. ఈ టోర్నీలో భాగంగా, ఆదివారం భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు మ్యాచ్ రిఫరీగా మళ్లీ ఆండీ పైక్రాఫ్టే‌ను ఐసీసీ నియమించింది. ఆయన నియామకంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఐసీసీ మాత్రం వెనక్కి తగ్గలేదు. పీసీబీ విన్నపాలను నిక్కచ్చిగా తిరస్కరిస్తూ, తమ నిర్ణయానికే కట్టుబడింది.
 
గత ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ వివాదం మొదలైంది. ఆ మ్యాచ్ భారత జట్టు తమ విధానపరమైన నిర్ణయం ప్రకారం పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. అదేసమయంలో, టాస్ వద్ద భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ సంప్రదాయాన్ని పాటించకపోవడంతో పైక్రాఫ్ట్ తీరుపై పీసీబీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పీసీబీ, పైక్రాఫ్ట్‌ను టోర్నమెంట్ నుంచి, ముఖ్యంగా తమ మ్యాచ్ నుంచి తప్పించాలని కోరుతూ ఐసీసీకి రెండుసార్లు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది.
 
అయితే, పీసీబీ చేసిన రెండు అభ్యర్థనలను ఐసీసీ తోసిపుచ్చింది. పైక్రాఫ్ట్ క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించారన్న వాదనలను ఖండించింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ వెన్యూ మేనేజర్ చెప్పిన సందేశాన్ని మాత్రమే పైక్రాఫ్ట్ తెలియజేశారని, ఆయన కేవలం ఒక మధ్యవర్తి మాత్రమేనని ఐసీసీ స్పష్టం చేసింది. మ్యాచ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు ఈ సమాచారం అందడంతో దానిని చేరవేయడం మినహా ఆయన ఏమీ చేయలేకపోయారని
వివరణ ఇచ్చింది. 
 
ఈ వివాదంపై పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్ (కెప్టెన్ సల్మాన్, హెడ్‌కోచ్ మైక్ హెస్సేన్, మేనేజర్ నవీద్ అక్రమ్ చీమా)తో పైక్రాఫ్ట్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, సమాచార లోపం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే, పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పలేదని, కేవలం విచారం మాత్రమే వ్యక్తం చేశారని ఐసీసీ తర్వాత మరో ఈ-మెయిల్ స్పష్టం చేసింది. అంతేకాకుండా పీసీబీ 'ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా' (పీఎంఓఏ) నిబంధనలను ఉల్లంఘించిందని ఐసీసీ ఆరోపించగా, పీసీబీ దానిని ఖండించింది.