శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 జూన్ 2024 (17:13 IST)

ఢిల్లీలో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలి : ప్రధానికి ఆప్ వినతి

athishi
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో నీటి సంక్షోభం తలెత్తింది. నీటి కొరతతో నగరవాసులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కేంద్రాన్ని ఢిల్లీ ప్రభుత్వం కోరింది. నగరంలో నెలకొన్న నీటి ఎద్దడికి రెండు రోజుల్లో ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆ పార్టీ మహిళా నేత ఆదిషి బుధవారం ఓ లేఖ రాశారు. 
 
తమ నీటి వాటాను హర్యానా ప్రభుత్వం సరైన సమయానికి విడుదల చేయకపోవడంతో ఢిల్లీలో నీటి సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. 'వాటా ప్రకారం.. హర్యానా నుంచి ఢిల్లీకి రోజుకు 613 మిలియన్‌ గ్యాలన్లు రావాల్సిఉంది. కానీ, మంగళవారం 513 మిలియన్ గ్యాలన్లను మాత్రమే విడుదల చేసింది. ఒక ఎంజీడీ నీరు 28,500 మంది అవసరాలకు వినియోగించవచ్చు. అంటే 28 లక్షల మందికి పైగా నీటి కొరతతో నరకం చూస్తున్నారు. ఈ సమస్యపై ఇప్పటికి ఎన్నోసార్లు అక్కడి ప్రభుత్వానికి లేఖ రాశాం' అని ఆదిషీ రాసిన లేఖలో పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం వేడి గాలుల కారణంగా ఇబ్బందిపడుతున్న నగరవాసులకు నీటి సంక్షోభం కూడా తోడైందని ఢిల్లీ మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. 'ఈ సమస్యను పరిష్కరించాలని ప్రధాని మోడీకి లేఖ రాశా. ఒకవేళ జూన్‌ 21వ తేదీ లోగా వారు స్పందించకపోతే.. నిరవధిక దీక్ష చేపడతా' అని ఆతిశీ స్పష్టంచేశారు. కాగా.. యమునా నదీ ప్రవాహం తగ్గడంతో ఢిల్లీ నీటి అవసరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సమస్యను కొంతైనా తగ్గించేందుకు నీటి సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా అధికారిక బృందాలు గస్తీ కాస్తున్నాయి.