ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (15:20 IST)

వణికిస్తున్న డెంగీ ఫీవర్ : 9 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు!

దేశంలోని పలు రాష్ట్రాల్లో డెంగీ దోమ కలవరపెడుతోంది. గతకొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, ఢిల్లీల్లో అనేక మంది డెంగీ జ్వరం బారిపడుతున్నారు. వీరిలో అనేక మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఆందోళన కలిగిస్తోంది. 
 
దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక బృందాలను పంపించింది. డెంగీ నివారణకు సాంకేతిక సహాయం అందించడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా రాష్ట్రాలకు ఈ బృందాలు సూచనలు చేయనున్నాయి.
 
దేశరాజధాని ఢిల్లీతో పాటు హర్యానా, పంజాబ్‌, కేరళ, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ)తోపాటు నేషనల్‌ వెక్టార్‌ బోర్న్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం నిపుణులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించారు. 
 
ముఖ్యంగా డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ప్రజారోగ్యానికి తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించడంతో పాటు వ్యాధి కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తలను తెలుసుకోనున్నారు. ఈ సమయంలో రాష్ట్రాలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించడంతోపాటు పలు జాగ్రత్తలను వివరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించనున్నారు.