శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 31 జులై 2024 (11:48 IST)

వయనాడ్‌లో వరద ఉధృతిదాటికి తెగిపోయిన శరీర అవయవాలు... కొట్టుకునిపోయిన మృతదేహాలు!!

Kenya Floods
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ప్రకృతి ప్రకోపానికిగురైంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వయనాడ్‌లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలు ప్రాంతాలు శిథిలాల కింద చిక్కుకునిపోయాయి. వరద ప్రవాహంధాటికి శరీర అవయవాలు సైతం తెగిపోయాయి. ఒక ప్రాంతంలో ఏకంగా 31 శవాలు నీటిలో కొట్టుకునిపోయాయి. 
 
తీరం పొడవునా ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో చల్లటి నీటితో అలరారే చలియార్ నది ఉధృతంగా ప్రవహించింది. ఈ ఉత్పాతంలో ముండక్కై ప్రాంతంలో చనిపోయిన 31 మంది మృతదేహాలు కొట్టుకునిపోయాయి. చలియార్ నదిలో 25 కిలోమీటర్ల మేర కొట్టుకుపోయి మలప్పురం జిల్లా నీలంబూర్‌కు సమీపంలోని పోతుకల్లు వద్దకు చేరుకున్నాయి. అక్కడ రెస్క్యూ టీములు ఆ మృతదేహాలను వెలికితీశాయి. అయితే ప్రవాహ ఉధృతికి మృతదేహాల శరీరభాగాలు ముక్కలు ముక్కలుగా ఊడిపోయాయి! 
 
వరదనీటి ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో మరిన్ని మృతదేహాలు చలియార్ నదిలో కొట్టుకొచ్చే ప్రమాదం ఉందని రెస్క్యూటీములు అంచనా వేస్తున్నాయి. నదిలో నీటి స్థాయులు క్రమక్రమంగా పెరుగుతుండటంతో స్థానిక ప్రజలు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో సోమవారం ఉదయం నుంచి నదిలో నీటిమట్టంపై ఒక కన్ను వేసి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 
 
సోమవారం అర్థరాత్రి దాటాక తెల్లవారుజామున రెండు గంటల సమయంలో వయనాడ్ వైపు నుంచి చలియార్ నదిలో గ్యాస్ సిలిండర్లు, చెక్కదుంగలు కొట్టుకురావడం గమనించారు. వెంటనే ఆ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. మంగళవారం ఉదయం నుంచి నదిలో గాలించడం మొదలుపెట్టగా 26 మృతదేహాలు, వాటితాలూకూ శరీర భాగాలు దొరికాయి. చాలామంది బాధితులు శిథిలాల కింద చిక్కుకుపోయి.. బయటకు వచ్చే మార్గం లేక.. తమ ఆత్మీ యులకు ఫోన్లు చేసి ప్రాణాలు కాపాడాలంటూ ప్రాధేయపడ్డారు. 
 
ఇలాంటి ఫోన్ సంభాషణలను స్థానిక టీవీలు ప్రసారం చేస్తున్నాయి. చూరాల్మాలా ప్రాంతంలోని ఓ మహిళ తమ వారికి ఫోన్ చేసి ఇల్లు మొత్తం కూలిపోయిందని.. తాము శిథిలాల్లో ఉన్నామని.. తమను బయటకు తీయాలని, తమ ప్రాణాలు కాపాడాలని కోరుతున్న ఆడియో వైరల్ అవుతోంది.