శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 31 జులై 2024 (11:23 IST)

మతమార్పిడులకు పాల్పడితే 20 యేళ్ల జైళ్ళు...: చట్టం తెచ్చిన యోగి సర్కారు

yogi adityanath
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడులకు పాల్పడేవారిని, ప్రోత్సవహించేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ రాష్ట్రంలో మత మార్పిడులకు పాల్పడితే 20 యేళ్ల జైలుశిక్ష విధిస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిథ్యనాథ్ సర్కారు ఓ సవరణ బిల్లును తెచ్చి ఆమోదముద్ర వేసింది. మత మార్పిడికి పాల్పడిన నిందితుడికి భారీగా జరిమానా, బెయిల్ దొరకడం కష్టతరం, జీవిత ఖైదు విధించేలా చట్టసవరణను మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రతి పాదించింది. 
 
ఇప్పటివరకు బాధిత కుటుంబం చేసిన ఫిర్యాదు మేరకు మత మార్పిడి నిరోధక చట్టాన్ని పోలీసులు ప్రయోగిస్తున్నారు. అయితే, యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ ఆమోదం పొందితే మత మార్పిడికి సంబంధించి ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. మతం మారకపోతే ప్రాణాలు తీస్తామనే పద్ధతిలో తీవ్ర బెదిరింపులకు పాల్పడిన సందర్భంలో నిందితుడికి యావజ్జీవం కూడా విధించే అవకాశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో (ఉత్తరప్రదేశ్ చట్ట వ్యతిరేక మత మార్పిళ్ల నిషేధ బిల్లు-2024 (సవరణ) ఉంది. 
 
అలాగే, జరిమానాను రూ.10 లక్షల వరకు విధించవచ్చు. బెయిల్ పొందటం గతంతో పోల్చితే చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడున్న చట్టం ప్రకారం, చిన్నపిల్లలను, దివ్యాంగులను, మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులను, మహిళలను, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారి మత మార్పిడికి ప్రయత్నించిన వ్యక్తి శిక్షార్హుడు. అలాంటి వ్యక్తికి ఇప్పటివరకు గరిష్టంగా రూ.లక్ష వరకు జరిమానా, జైలుశిక్ష కనిష్ఠంగా ఐదేళ్లు, గరిష్టంగా 14 ఏళ్లు విధిస్తున్నారు. 
 
కానీ, చట్ట సవరణ బిల్లు ప్రకారం, గరిష్ఠంగా యావజ్జీవ కారాగార శిక్షను కూడా విధించవచ్చు. మత మార్పిడి అవసరాల కోసం విదేశీ సంస్థలు లేక నిషేధించిన సంఘాల నుంచి నిధులు అందుకున్నట్టు రుజువైతే, 14 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. బెదిరించి, ప్రాణాంతక ఒత్తిడికి గురిచేసి మత మార్పిడి జరిపిన కేసుల్లో నిందితుడికి 20 ఏళ్లకు పైగా జైలుశిక్ష విధి స్తారు. ఒక్కొక్కసారి యావజ్జీవం కూడా పడవచ్చు. కోర్టు తన విచక్షణాధికారం ఉపయోగించి బాధితులకు 5 లక్షల వరకు పరిహారం కూడా ఇప్పించవచ్చునని చట్ట సవరణ బిల్లులో స్పష్టం చేశారు.