మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 మే 2024 (11:02 IST)

కాంగ్రెస్ నేతపై చేయి చేసుకున్న డిప్యూటీ సీఎం శివకుమార్

dk shivakumar
కాంగ్రెస్ నేతపై కర్నాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేయి చేసుకున్నారు. తన భుజంపై చేయి వేసిన ఓ కాంగ్రెస్ నేత చెంప చెళ్లుమనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవీయ నెట్టింట షేర్ చేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. 
 
ధార్వాడ్ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి వినోదా అసూటీ తరపున హవేరీలో డీకే శనివారం ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఈ సందర్భంగా కారు దిగిన ఆయన వీపుపై కాంగ్రెస్ మున్సిపల్ సభ్యుడు అల్లావుద్దీన్ మనియార్ చెయ్యి వేశారు. దీంతో, ఆగ్రహానికిలోనైన డీకే.. ఆయన చెంప ఛెళ్లుమనిపించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అల్లావుద్దీన్‌ను వెనక్కు తోసేశారు. 
 
ఈ ఘటన తాలూకు వీడియోపై అమిత్ మాలవీయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. 'కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ మున్సిపల్ మెంబర్ చెంప చెళ్లుమనిపించారు. హవేరీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలపై డీకే చేయి చేసుకోవడం ఇది కొత్త కాదు. 
 
మనియార్ తప్పేంటి అంటే ఆయన డీకే భుజంపై చేయి వేయడమే. అసలు కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కోసం ఎందుకు పనిచేస్తారో నాకు అర్థంకాదు. వాళ్ల నాయకులు కార్యకర్తలపై చేయిచేసుకుంటుంటారు. నలుగురిలో అవమానిస్తుంటారు. ఎన్నికల్లో పోటీకి టిక్కెట్లు ఇవ్వరు. అవినీతి డబ్బు కోసమే కార్యకర్తలు కాంగ్రెస్ కోసం పనిచేస్తుంటారా? ఆత్మాభిమానం లేదా?' అని ఆయన ప్రశ్నించారు.