1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 డిశెంబరు 2022 (16:51 IST)

మందు బాబులకు పిల్లను ఇవ్వొద్దు.. కేంద్ర మంత్రి కౌశల్ వినతి

liquor
ఆడ పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ ఓ విజ్ఞప్తి చేశారు. మద్యం బాబులకు పిల్లను ఇవ్వొద్దని కోరారు. మద్యానికి అలవాటుపడిన తన కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని, ఇపుడు అతని భార్య ఏకాకిగా మిగిలిందన్న ఆవేదనను వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదని ఆయన కోరారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ తాను ఎంపీగా, తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా మద్యానికి అలవాటుపడిన తన కుమారుడి ప్రాణాలు కాపాడుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని డీ అడిక్షన్ కేంద్రంలో కూడా చేర్పించామని, ఆ అలవాటును మానేస్తాడనే అనుకున్నామని, ఆ తర్వాత ఆరు నెలలకు పెళ్లి చేసుకున్నాడని చెప్పారు. 
 
కానీ, మళ్లీ తాగుడుకు అలవాటుపడిన ఆయన చివరకు రెండేళ్ల క్రితం చనిపోయాడని తెలిపారు. అతను చనిపోయేటపుడు అతని కుమారుడికి రెండేళ్ల వయస్సు మాత్రమేనని చెప్పారు. అతని భార్య ఒంటరిదైనందన్నారు. ఇలాంటి పరిస్థితి ఏ ఒక్కరికీ రాకూడదన్నారు. మద్యానికి బానిసైన అధికారి కంటే ఒక కూలీ లేదా రిక్షా కార్మికుడిని పెళ్లికొడుకుగా ఎంపిక చేయడం మంచిదని అన్నారు. 
 
మీ కూతుర్లను, అక్క చెల్లెళ్లను కాపాడుకోవాలని తెలిపారు. మద్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా యేటా 20 లక్షల మంది మరణిస్తున్నారని తెలిపారు. మద్యానికి అలవాటైనవారి జీవితకాలం చాలా తక్కువ అని చెప్పారు. విద్యార్థి దశలోనే దీనిపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు.