గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (09:03 IST)

ఉద్యోగుకు ఈపీఎఫ్‌వో ఆసరా : కేవైసీ పూర్తయితే ఆటో-క్లెయిమ్ సెటిల్మెంట్

దేశలో కరోనా వైరస్ ఉధృతి సాగుతోంది. దృష్ట్యా వేతన జీవులకు ఆసరా ఇచ్చేందుకు ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో) ముందుకొచ్చింది. రెండోసారి కొవిడ్‌-19 అడ్వాన్స్‌ను పొందేందుకు 5 కోట్లకు పైగా ఉన్న తన చందాదారులకు అవకాశం కల్పించింది. దీన్ని బట్టి మూడు నెలల మూల వేతనాన్ని (బేసిక్‌ పే + కరువు భత్యం) లేదా తమ పీఎఫ్‌ ఖాతాలోని 75 శాతం మొత్తాన్ని ఏది తక్కువైతే అది తీసుకోవచ్చు. 
 
ఈ రెండింటి కంటే తక్కువ మొత్తాన్నీ ఉపసంహరించుకోవచ్చు. చందాదారులు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు వీలుగా గత ఏడాది మార్చిలో మొదటిసారిగా కొవిడ్‌-19 అడ్వాన్స్‌ పొందే అవకాశాన్ని ఈపీఎఫ్‌వో కల్పించింది. ఇప్పుడు రెండోసారి అనుమతినిచ్చింది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో తన చందాదారులకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కార్మిక శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. 
 
ఈ మేరకు ఉద్యోగుల భవిష్య నిధి చట్టం-1952లో సవరణ చేసింది. రూ.15 వేలలోపు జీతం ఉన్న ఉద్యోగులకు ఈ అడ్వాన్స్‌ ఆసరాగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈపీఎఫ్‌వో 76.31 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించింది. తద్వారా రూ.18,698.15 కోట్లను అడ్వాన్స్‌గా ఉద్యోగులకు చెల్లించింది. ఇంతకుముందు అడ్వాన్స్‌ తీసుకున్నవారూ రెండోసారి అడ్వాన్స్‌ పొందేందుకు అర్హులే. 
 
ఉపసంహరణ ప్రక్రియ గతంలో మాదిరిగానే ఉంటుందని ఈపీఎఫ్‌వో తెలిపింది. సభ్యుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొవిడ్‌-19 క్లెయిమ్‌లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. ‘కేవైసీ’ పూర్తయిన సభ్యులకు సిస్టం ఆధారంగా ఆటో-క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపింది.