శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 జూన్ 2024 (15:06 IST)

వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అయితే సమాజానికి మరింత హాని : సుప్రీంకోర్టు

neet exam
వ్యవస్థను మోసం చేసిన ఒక వ్యక్తి డాక్టర్ అయితే అతను సమాజానికి మరింత హాని చేస్తాడని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానిస్తూ... నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మొట్టికాయ వేసింది. దేశ వ్యాప్తంగా వైద్య కోర్సుల ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఎన్టీయే జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది. అయితే ఈ యేడాది మే నెల 5వ తేదీన నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ అయింది. అలాగే, గ్రేస్ మార్కులు ఇవ్వడంలోనూ, ర్యాంకుల కేటాయింపులో అక్రమాలు, అవకతవకలు జరిగాయి. 
 
నీట్ 2024 ప్రశ్నపత్రాన్ని బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో రూ.30 లక్షలకు అమ్ముకున్నట్టు ఆరోపణల నేపథ్యంలో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇండియా కూటమికి చెందిన విపక్ష పార్టీలన్నీ ఈ పరీక్షలను రద్దు చేసి మళ్లీ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. అదేసమయంలో ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ సందర్భంగా ఎన్టీయేకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్‌లతో కూడిన ధర్మాసనం మొట్టికాయ వేసింది. 
 
ఈ ప్రక్రియలో ఎక్కడైనా 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా దానిని పూర్తిగా పరిష్కరించాలని సూచించింది. పరీక్ష నిర్వహించే ఏజెన్సీగా మీరు న్యాయంగా వ్యవహరించాలి. పొరపాటు జరిగితే.. ఔను ఇది పొరపాటు అని చెప్పండి. కనీసం మీ పనితీరుపై విశ్వాసాన్ని కలిగిస్తుంది అని వ్యాఖ్యానించింది. దేశంలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల పడే కష్టాన్ని ఏజెన్సీ మరిచిపోరాదని గుర్తుచేసింది. వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అవుతాడని అనుకోండి.. అపుడు అతను సమాజానికి మరింత హాని కలిగిస్తాడు అంటూ ఘాటు వ్యాఖ్యానిస్తూ ఈ కేసును వచ్చే నెల 8వ తేదీకి వాయిదావేసింది.