ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్రం కుట్రలు : రైతు సంఘాల నేతల ఆరోపణ
దేశ రాజధాని నగరంలోని ఢిల్లీలో తమ నిరసన కార్యక్రమాలను అణచివేసేందుకు రైల్వేశాఖ పలు రైలు సర్వీసులను రద్దు చేయడం, దారి మళ్లించడం చేస్తుందని రైతు సంఘాల నేతలు ఆరోపించాయి. ఢిల్లీలో తమ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రైతులు వస్తున్న రైళ్లను రైల్వేశాఖ దారి మళ్లించడం, రైలు సర్వీసులను రద్దు చేయడం చేస్తుందని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు సుఖ్ దేవ్ సింగ్ కొక్రికలాన్ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్రంలోని భటిండా, మాన్సా, ఫిరోజ్ పూర్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి వస్తుండగా రైళ్లను సరిహద్దుల్లోనే నిలిపివేశారని సుఖ్ దేవ్ సింగ్ చెప్పారు. రైళ్లను రద్దు చేయడం, దారిమళ్లించటాన్ని ఖండిస్తున్నామని చెప్పారు.
రైతులు ఆందోళనను కొనసాగించేందుకు ట్రాక్టర్లు, బస్సులు,ట్రాలీలు, టెంపోల్లో తరలివస్తున్నారని కొక్రికలాన్ వివరించారు.వెయ్యిమంది రైతులు రైలులో ఢిల్లీకి వస్తుండగా టిక్రి సరిహద్దుకు నాలుగుకిలోమీటర్ల దూరంలోని బహదూర్ ఘడ్ వద్ద దించివేశారని చెప్పారు.
గంగానగర్ - ఓల్డ్ ఢిల్లీ రైలును కూడా బహదూర్‌గఢ్ వద్ద నిలిపివేశారు. ముంబై సెంట్రల్ నుంచి వచ్చే అమృత్ సర్ స్పెషల్ రైలును జనవరి 13 నుంచి దారి మళ్లించారు. దర్బంగా - అమృత్ సర్ స్పెషల్ రైలు కూడా రద్దు చేశారు.