1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 డిశెంబరు 2021 (09:28 IST)

రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు ఉచిత వైద్యం.. సీఎం ఎంకే స్టాలిన్

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజారంజక నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు తొలి 48 గంటల పాటు ఉచిత వైద్యం అందించేలా నిర్ణయం తీసుకున్నారు. 
 
ప్రమాదంలో గాయపడినవారికి తొలి 48 గంటలు అత్యంత కీలకం అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రం, ప్రాంతంతో నిమిత్తం లేకుండా తమిళనాడు రాష్ట్ర పరిధిలో రోడ్డు ప్రమాదంలో గాయపడే వారందరికీ ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. ఇందుకోసం "ప్రాణాలను కాపాడుదాం" అనే పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. 
 
ఈ పథకం అమలు కోసం రాష్ట్రంలో 201 ప్రభుత్వ ఆస్పత్రులు, 408 ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వం ఎంపిక చేసింది. క్షతగాత్రులు ఏ ప్రాంతంవారైనా, ఏ దేశం వారైనా, ఏ రాష్ట్రం వారైనా సరే తమిళనాడు రాష్ట్ర పరిధిలో ప్రమాదం జరిగితే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. 
 
ప్రమాదాల్లో గాయపడిన వారికి తొలి 48 గంటలు ఎంతో కీలకం కావడంతోనే తమ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం స్టాలిన్ తెలిపారు. ఈ పథకాన్ని చెంగల్పట్టు జిల్లా, మేల్‌మరువత్తూరులోని ఆదిపరాశక్తి వైద్య కాలేజీలో శనివారం లాంఛనంగా ప్రారంభించారు.