అమ్మవారి దర్శనం కోసం వెళ్లి వస్తూ అనంతలోకాలకు .. ఆటోను వెనుక నుంచి ఢీకొట్టిన కారు
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలో ఓ కారు, ఆటోలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాద వివరాలను పరిశీలిస్తే, కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన శశి భరత్ అనే వ్యక్తి కారును అతివేగంగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ సమయంలో కొమురవెల్లి దేవాలయం దర్శనం పూర్తిచేసుకుని గజ్వేల్ వైపు ఓ ఆటో వెళుతుంది.
దీన్ని వెనుక నుంచి అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం సరిగ్గా జిల్లాలోని కొండపాక మండలంలోని కొడకండ్ల గ్రామ శివారులో ఉన్న ఒక వంతెన వద్ద జరిగింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నాగమణి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.