సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 డిశెంబరు 2021 (12:00 IST)

గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం: జూనియర్ ఆర్టిస్టులు సహా ముగ్గురు మృతి

గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు సహా ముగ్గురు మృతి చెందారు. కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు, డ్రైవర్ మృతి చెందారు. ఈ ఘటన గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ రోడ్డులో చోటుచేసుకుంది. 
 
శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మానస (22), మానస (21)గా గుర్తించారు. వీరితో పాటు డ్రైవర్‌ అబ్దుల్లా మృతి చెందాడు. మరో జూనియర్ ఆర్టిస్ట్ సిద్ధు తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు విజయవాడకు చెందిన బ్యాంక్‌ ఉద్యోగి అబ్దుల్‌ రహీం కూడా మరణించాడు.
 
స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సిద్ధూను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.