1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 డిశెంబరు 2021 (16:54 IST)

మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్న ధర్మపురి శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్రంలో ఒకపుడు సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) ప్రస్తుతం తెరాసలో కొనసాగుతున్నారు. ఇపుడు ఈయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇదే అంశంపై ఆయన హస్తినకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ప్రత్యేకంగా అర్థగంట సేపు చర్చలు జరిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిక ఖాయమైనట్టేనని కాంగ్రెస్ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. దీనిపై శుక్రవారం ఏఐసీసీ అధికారిక ప్రకటన జారీ చేయొచ్చని తెలుస్తోంది.
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక కీలకమైన పదవులు, పీసీసీ చీఫ్‌గా కొనసాగిన డీఎస్.. 2009లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేర్రారు. ఆ తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడుగా అవకాశం కల్పించింది. 
 
అదేసమయంలో ఈయన కుమారుడు మాత్రం భారతీయ జనతా పార్టీలో చేరి నిజామాబాద్ నుంచి గెలుపొందారు. ఇక్కడ పోటీ చేసిన సీఎం కేసీఆర్ కుమార్తె కె.కవితను డీఎస్ తనయుడు ఓడించి లోక్‌సభలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి తెరాసకు, డీఎస్‌కు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. 
 
గత కొన్ని నెలలుగా తెరాసతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నారు. అదేసమయంలో ఆయన రాజ్యసభ పదవీకాలం కూడా త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.