1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 మే 2024 (10:49 IST)

రాయ్‌బరేలి నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ!!

rahul gandhi
కాంగ్రెస్ పార్టీ ఉత్తరాది రాష్ట్రంలో అత్యధిక స్థానాలు దక్కించుకునే విషయంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా, ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా గాంధీ - నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయబరేలీ స్థానం నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించాయి. అమేథీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. 
 
ఉత్తరప్రదేశ్‌లోని ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించని విషయం తెలిసిందే. మే 20న నామినేషన్ దాఖలకు చివరి తేదీగా లోక్‌సభ ఐదో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇంతకాలం రాయబరేలీ నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేశారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభ స్థానానికి పోటీ పడుతున్నారు. ఈ రెండు స్థానాలకు పార్టీ నామినేషన్ పేపర్లను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
 
మరోవైపు, రాయబరేలీ నుంచి తమ పార్టీ అభ్యర్థిగా దినేశ్ ప్రతాప్ సింగ్‌ను బీజేపీ గురువారం ప్రకటించింది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన సోనియా గాంధీ చేతిలో పరాజయం పొందారు. ఇక గాంధీ కుటుంబ విశ్వాసపాత్రుడు కిషోరీ లాల్ అమేథీ నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో అమెథీ నుంచి బరిలోకి దిగిన రాహుల్ గాంధీ స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలైన విషయం తెల్సిందే. 
 
అయితే, రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలు సమర్పించేటప్పుడు సోనియా గాంధీ కూడా వెంట ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమేథీ నుంచి రాహుల్ గాంధీ వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు. 2004 నుంచి 2019 వరకూ ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ఎంపీగా ఉన్నారు. మరోసారి ఇక్కడి నుంచి బరిలో నిలిచారు. అయితే, పార్టీ ఆదేశాల అనుసారం తాను నడుచుకుంటానని గతంలోనే రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.