సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2020 (09:47 IST)

మూడు నెలలు గ్యాస్ సిలిండర్లు ఉచితం!

లాక్ డౌన్ తో దేశవ్యాప్తంగా సామాన్య, పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కరువైంది. ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పేదలకు కాస్త ఊరట ఇచ్చింది. 'పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన' కింద మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనుంది కేంద్రం. ఏప్రిల్ నుంచి జూన్ 3 వరకు మూడు నెలల పాటు నెలకు ఒకటి చొప్పున గ్యాస్ సిలిండర్ ఇస్తారు.

అయితే అందరికీ కాదు. కేవలం ‘ పీఎం ఉజ్వల’ పథకం లబ్ధిదారులకు మాత్రమే. ఈ పథకం కింద 8 కోట్ల మంది గ్యాస్ కనెక్షన్ లబ్దిదారులు ఉన్నారు. నెలకు ఒకటి చొప్పున వరుసగా మూడు నెలలు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు.
 
ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందేందుకు అవసరమైన మార్గదర్శకాలు ఇవే: 
ప్రధాన మంత్రి ‘గరీబ్‌ కల్యాణ్‌ పథకం’లో భాగంగా ఉజ్వల పథకం లబ్ధిదారులకు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందజేయనున్నారు. లబ్ధిదారుల వివరాల మేరకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు సిలిండర్ల ధర (ప్రాంతాలను బట్టి మారుతుంది) బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నారు.

* బ్యాంకులో నగదు జమ చేశాక ఫోన్ లో గ్యాస్‌ సిలిండర్ బుక్‌ చేసుకోవాలి. ఎవరి మొబైల్ నెంబర్లయినా లింక్ కాకపోతే..గ్యాస్‌ ఏజెన్సీ దగ్గరికి ఆధార్‌ కార్డును తీసుకెళ్లి నమోదు (రిజిస్ట్రేషన్‌) చేయించుకోవాలి. నేరుగా ఇంటికి గ్యాస్‌ సిలిండరు సరఫరా చేస్తారు.
 
ఈ సమయంలో గ్యాస్‌ ఏజెన్సీ ప్రతినిధి ఒక దరఖాస్తు తీసుకొస్తారు. అందులో తమకు సిలిండర్‌ అందినట్లు లబ్ధిదారు ధ్రువీకరణ చేయాలి. మొబైల్ కి వచ్చే ఓటీపీని ఇందులో పొందు పర్చాలి.

వినియోగించుకుంటేనే సొమ్ములు:
ప్రభుత్వం మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందజేస్తోంది. దీనికి సంబంధించిన నగదు బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది కనుక గ్యాస్‌ సిలిండరు తీసుకోకపోయినా ఫరవాలేదు. నగదు బ్యాంకు ఖాతాలో ఉంటుంది కదా అని వదిలేస్తే మొదటికే మోసం వస్తుంది!

తొలి విడత గ్యాస్‌ సిలిండరు తీసుకున్నట్లు నమోదైతేనే రెండో గ్యాస్‌ విడత సొమ్ములు బ్యాంకు ఖాతాలో జమవుతాయి. రెండోది తీసుకున్నట్లు ధ్రువీకరణ జరిగితేనే మూడో విడత డబ్బులు జమవుతాయి. తొలి విడతలో గ్యాస్‌ సిలిండర్‌ వినియోగించుకోక పోతే తరువాత రెండు విడతల సొమ్ము కోల్పోవాల్సి వస్తుంది. 

బ్యాంకు ఖాతాలోనే సొమ్ము జమ చేస్తున్నందున గ్యాస్‌ ఏజెన్సీలకు డిజిటల్‌ పద్ధతిలోనే ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేయాలని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
 
బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి:
‘ఉజ్వల’ పథకం కింద లబ్ధిదారులందరికీ ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే కొంతమంది లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో సొమ్ములు జమయ్యాయి. తొలి నెల సిలిండర్ తీసుకుంటేనే తర్వాత నెల నిధులు జమవుతాయి. కరోనా ఆపత్కాలంలో ఇది పేదలకు వరం అని అధికారులు చెబుతున్నారు.

15 రోజులకు ఒకటి బుక్ చేసుకోవచ్చు:
ఇది ‘ఉజ్వల’ పథకం లబ్ధిదారులకు చాలా ప్రయోజనం అని అధికారులు చెప్పారు. మూడు నెలలకు మూడు సిలిండర్లు తీసుకోవచ్ఛు అన్నారు. ఇంకా అవసరమైతే 15 రోజులకు ఒకటి తీసుకొనే వెసులుబాటు కూడా ఉందని వివరించారు. ఎలా తీసుకున్నా కేవలం మూడు సిలిండర్లు ఉచితంగా అందుతాయి.

మరోవైపు లాక్ డౌన్ తో దేశంలో వంట గ్యాస్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన అదనపు ఎల్పీజీను సరఫరా చేయడానికి యూఏఈ సిద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఏప్రిల్ నుంచి జూన్ 3 వరకు పీఎం ఉజ్వల పథకం కింద లబ్దిదారులకు ప్రతి ఒక్కరికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ట్విట్టర్ లో తెలిపారు.