పెళ్లి విందు భోజనం ఆరగించి 1200 మంది అస్వస్థత
గుజరాత్ రాష్ట్రంలో ఓ పెళ్లి విందులో అపశృతి చోటుచేసుకుంది. దీంతో 1200 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరంతా పెళ్లి విందు భోజనాన్ని ఆరగించిన తర్వాత అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని మోహసనా జిల్లాలో జరిగింది.
కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం తగ్గి దేశ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో విందులు, వినోదాలు, శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత తన కుమారుడు పెళ్లిని ఘనంగా నిర్వహించారు.
ఈ పెళ్లికి భారీ సంఖ్యలో అతిథులు తరలివచ్చారు. ఈ పెళ్లితంతు ముగిసిన తర్వాత పెళ్లి విందు భోజనం ఆరగించారు. అయితే, ఈ భోజనం కలుషితమై ఉండటంతో వారంతా అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఆహారం ఆరగించిన చాలా మందికి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. విందులో ఏర్పాటు చేసిన ఆహార నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
మరోవైపు, ఈ ఘటనపై ఫుడ్ అండ్ డ్రగ్ విభాగం అధికారులు దర్యాప్తు చేపట్టారు. విందులో అతిథులు వడ్డించిన ఆహార పదార్థాల్లో మాంసాహారం కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ విందులో ఉపయోగించిన మాంసం నిల్వ చేయడం వల్ల ఇలా జరిగిందా? లేక వేరే కారణాలా? అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.