కేవలం మూడు మామిడి పండ్లు మాత్రమే ఆరగించా : కేజ్రీవాల్
తాను జైలులో కేవలం మూడు మామిడి పండ్లు మాత్రమే ఆరగించానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి తీహార్ జైలులో ఉంటున్న కేజ్రీవాల్... జైలులో తాను మొత్తం 48 సార్లు భోజనం చేస్తే కేవలం మూడు మామిడిపండ్లు మాత్రమే ఆరగించానని, ఒకసారి ప్రసాదంగా ఆలూ ఆరగించినట్టు చెప్పారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న తనకు ఇంటి నుంచే మామిడి పండ్లు వచ్చాయని చెప్పారు.
కాగా, తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్.. బెయిల్ కోసం ఉద్దేశ్యపూర్వకంగా మామిడి పండ్లు, ఆలూ, స్వీట్లు తింటున్నారంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో కేజ్రీవాల్ తరపున శుక్రవారం సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ.. కేజ్రీవాల్ భోజనానికి సంబంధించిన వివరాలను సమర్పించారు.
జైల్లో తనకు ఇన్సులిన్ అందించాలని కోరుతూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరపున అభిషేక్ మను వివరాలు సమర్పించారు. కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ పెంచుకోవడానికి స్వీట్స్, మామిపండ్లు, ఆలూ తింటున్నారంటూ ఈడీ వాదనలపై అభిషేక్ సింఘ్వీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలూ కూడా ప్రసాదంగా కేవలం ఒకేసారి మాత్రమే తిన్నారని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జికి తెలిపారు.