సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 జనవరి 2025 (08:37 IST)

Happy 76th భారత గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?

national flag
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి ప్రతి యేటా జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకుంటారు. ఇలా ఎందుకు జరుపుకుంటారో చాల మందికి తెలియదు. స్వాతంత్ర్య దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి ఎంతో తేడా వుంది. త్రివర్ణ పతాకం ఎగుర వేయడంలోనూ వ్యత్యాసం ఉంది. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగురవేస్తారు. జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం రోజున మువ్వెన్నెల జెండాను ఆవిష్కరిస్తారు. 
 
నిజానికి భారతదేశానికి స్వాతంత్ర్యం అనేది ఎందరో త్యాగధనుల పోరాటాల కారణంగా 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటీష్ ప్రభుత్వం నుంచి లభించింది. జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్నాయి. అనేక రాష్ట్రాలకు చెందిన శకటాలు రిపబ్లిక్ డే పరేడ్‌లో భాగం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే వెనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం. మన దేశానికి స్వతంత్యం వచ్చే నాటికి రాజ్యాంగం అందుబాటులో లేదు. దీంతో 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన కొనసాగింది.
 
స్వతంత్ర్య భారతావని కోసం రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947 ఆగస్టు 28న రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ అధ్యక్షునిగా బాబా సాహెబ్, అంబేద్కర్ బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభ (తాత్కాలిక పార్లమెంట్)కు సమర్పించారు. దాదాపు రెండేళ్ల పాటు 308 మంది సభ్యులు వివిధ దేశాల రాజ్యాంగాలను క్షుణ్నంగా పరిశీలించారు. వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి కొన్ని అంశాలను తీసుకుని వాటికి పలు సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. దానిని ఇంగ్లీష్, హిందీ భాషలలో చేతిరాతతో తయారు చేసి 1950 జనవరి 24న సంతకాలు చేసి ఖరారు చేశారు.
 
అలా తయారైన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి బ్రిటీష్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం పూర్తిగా దూరమైంది. చారిత్రాత్మకంగా ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యం దష్ట్యా జనవరి 26వ తేది గణతంత్ర దినంగా ఎంపిక చేశారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను పూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవంగా జరపుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశమంతటా వాడవాడలా ప్రజలు జాతీయ పతకాన్ని ఎగురవేసి సంబరాలు జరుపుకుంటున్నారు.