గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2020 (17:32 IST)

భార్యకు మరొకరితో లింక్ ఉందన్న అనుమానం, చనిపోయేదాకా పొడిచాడు

మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే ఆరోపణతో ఒక వ్యక్తి సొంత భార్యను కడతేర్చాడు. ఈ దారుణ ఘటన పంజాబ్‌లో గురువారం వెలుగు చూసింది. మృతురాలు.. తన బంధువుల ఇంటికి వెళ్లగా.. అక్కడకు వెళ్లిన ఆమె భర్త పదునైన పెద్ద కత్తితో ఆమె కడుపులో పొడిచాడు. పలుమార్లు పొడిచి.. ఆపై పోలీసులకు లొంగిపోయాడు నిందితుడు. ఈ ఘటన స్థానికంగా అలజడి రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని గోరయ పట్టణంలో జశ్వంత్ సింగ్, కుల్విందర్ సింగ్ భార్యాభర్తలు. వీరికి పెళ్లై చాలాకాలం అయింది. నలభై ఏళ్ల కుల్విందర్ సింగ్.. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని జశ్వంత్ సింగ్ పదే పదే గొడవ పడేవాడు. 
 
ఇదే విషయం మీద వారిద్దరికీ చాలాసార్లు గొడవలయ్యాయి. ఈ క్రమంలోనే కుల్విందర్.. జశ్వంత్‌తో గొడవ పడి తన బంధువుల ఇంటికి చేరింది. అయితే అక్కడకు చేరిన జశ్వంత్.. ఆమెతో గొడవ పడ్డాడు. మాటా మాటా పెరిగింది.
 
దీంతో సహనం కోల్పోయిన జశ్వంత్.. వెంట తెచ్చుకున్న పదునైన కత్తిని తీసుకుని ఆమె కడుపులో పలుమార్లు పొడిచి హత్య చేశాడు. అనంతరం తానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.