ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (16:27 IST)

ప్రేమించి పెళ్ళిచేసుకున్న భార్యను చంపిన భర్త.. కారణం తెలిసి పోలీసులు షాక్

మురికి కాల్వలో మహిళ మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు ఆమె హత్యకు భర్తే కారణమని తెలిసి అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో భార్యను ఎందుకు చంపాడో తెలుసుకుని షాక్ తిన్నారు.
 
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య డబ్బులను దుబారాగా ఖర్చు చేస్తోందని భర్త ఆగ్రహంతో రగిలిపోయాడు. అందులోనూ ఆమె కుటుంబానికి.. బంధువులకు తన జీతాన్ని ఖర్చు చేయడాన్ని సహించలేకపోయాడు. కులాంతర వివాహం కావడంతో అత్తింటివారెలాగూ పట్టించుకోవడంలేదని.. ఆస్తులమ్మేసి వేరే ఊరెళ్దామని ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఇక విసిగిపోయిన భర్త దారుణానికి పాల్పడ్డాడు. 
 
యూపీలోని ఫిరోజాబాద్‌కి చెందిన జిపేందర్ సింగ్ అలియాస్ భూపిందర్ అదే ప్రాంతానికి చెందిన లక్కీ జాదవ్‌ను ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో గోకులేష్‌పురం ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని వేరు కాపురం పెట్టారు. తర్వాత ఏడాదికి వారికి ఓ పాప పుట్టింది. భూపిందర్ ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
 
భార్య లక్కీ జాదవ్ విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేది. భర్త జీతాన్ని పుట్టింటి కోసం ఖర్చు చేసేది. తన బంధువులను, స్నేహితులను తీసుకెళ్లి మరీ ఖర్చు పెడుతుండటంతో భూపిందర్ సహించలేకపోయాడు. దానికితోడు ఇక్కడి నుంచి అలీగఢ్‌కి వెళ్లిపోదామని ఇంటిపోరు మొదలైంది. ఇక్కడ ఉన్న ఆస్తిని అమ్మేయాలని.. అలీగఢ్‌లో కొనుక్కుందామంటూ భర్తపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది.
 
తన జీతాన్ని ఇతరులకు ఖర్చు చేయడం.. అలీగఢ్‌కి వెళ్లాలని వేధింపులను భరించలేకపోయిన భూపిందర్ తన భార్యను చంపేయాలని నిర్ణయానికి వచ్చాడు. భార్య, కూతురుని అలీగఢ్ తీసుకెళ్లాడు. అక్కడ భార్య లక్కీ జాదవ్‌ను గొంతు నులిమి దారుణంగా చంపేశాడు. ఆమె మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి నైతోర్ గ్రామ సమీపంలోని ఓ మురికి కాల్వలో పడేసి పరారయ్యాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.