సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (10:14 IST)

పెళ్ళయి నెలరోజులే, పొద్దస్తమానం సెల్ ఫోన్ పట్టుకు కూర్చున్న భార్య.. చంపేసిన భర్త

సెల్‌ఫోన్... స్మార్ట్‌ఫోన్ వినియోగం శ్రుతిమించి మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతోంది. అనుమానంతో ప్రాణాలు తీసేసే వరకూ వెళుతోంది. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
కొత్తగా పెళ్ళయి మెట్టినింటికి వచ్చిన భార్య.. ఎప్పుడూ సెల్‌ఫోన్‌తోనే గడుపుతుండటాన్ని చూసి తట్టుకోలేకపోయిన భర్త దారుణంగా చంపేశాడు. పెళ్ళయిన రెండు నెలలకే అనుమానంతో భార్యను గొంతుకోసి చంపేసిన దారుణ ఘటన ఫిరోజాబాద్ పరిధిలోని రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
రామ్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఆసిఫ్‌కి కాశ్మీరీ గేట్ ప్రాంతానికి చెందిన అష్మాతో గత డిసెంబర్‌లో వివాహమైంది. పెళ్ళయి అత్తారింటికి వచ్చిన అష్మా నిత్యం సెల్‌ఫోన్‌తోనే గడుపుతుండటం.. తనను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం చెందిన భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్య అష్మా గొంతుకోసి చంపేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. 
 
ఆ సమయంలో ఆసిఫ్ తల్లి రబియా బేగం  అడ్డుపడడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే తల్లితో కలిసి నెత్తుటి మరకలతో రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన ఆసిఫ్.. తన భార్యను చంపేసినట్లు చెప్పి లొంగిపోయాడు. వెంటనే పోలీసులు అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 
కూతురుని అల్లుడు చంపేసిన విషయం తెలుసుకున్న అష్మా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసిఫ్ కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వివాహ సమయంలో బైక్, రెండు లక్షల కట్నం ఇవ్వలేదన్న కోపంతోనే తన కూతురుని దారుణంగా చంపేశారని మృతురాలి తండ్రి ఆరోపించాడు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
అష్మా అత్తింటి వారి వాదన మరోలా ఉంది. ఆమె ఎప్పుడూ ఫోన్‌లోనే గడుపుతుండేదని.. అష్మాకి వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం ఉందని ఆరోపించారు. ఎప్పుడూ ఫోన్‌లోనే ఉంటూ భర్తను పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకోకపోవడంతోనే ఆమెను భర్త చంపేశాడని చెబుతున్నారు. ఏదేమైనా సెల్‌ఫోన్ వ్యసనం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.