1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (15:41 IST)

ప్రమాదం జరిగింది.. క్షమించండి.. బాధ్యులపై కఠిన చర్యలు : ఉద్ధవ్ ఠాక్రే

ముంబైలోని ఓ మాల్‌లో ఉన్న సన్‌రైజ్ కరోనా ఆస్పత్రిలో గత రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది మృత్యువాతపడ్డారు. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. 
 
మాల్‌లోని మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు.. మూడో అంతస్తులో ఉన్న ఆస్పత్రి వరకు వ్యాపించాయి. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. అయితే తొలుత అగ్నిప్రమాదంలో రోగులెవరూ మరణించలేదని చెప్పిన ఆస్పత్రి యాజమాన్యం.. ఆ తర్వాత కొంతమంది రోగుల ఆచూకీ గల్లంతైనట్లు పేర్కొంది. ఆ తర్వాత పది మంచి చనిపోయిట్టు పేర్కొంది. 
 
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం అనంతరం ఘటనాస్థలాన్ని సందర్శించిన సీఎం.. మృతుల కుటుంబాలకు క్షమాపణలు తెలియజేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
 
'గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారిపై మనం పోరాటం సాగిస్తున్నాం. గతేడాది రాష్ట్రంలో వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభించిన సమయంలో బెడ్లు, వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. దీంతో తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రమాదం చోటుచేసుకున్న సన్‌రైజ్‌ ఆస్పత్రి కూడా అందులో ఒకటి. 
 
ఈ హాస్పిటల్‌ లైసెన్స్‌ గడువు మార్చి 31 వరకు ఉంది. దురదృష్టవశాత్తూ ఈ ఆస్పత్రి ఉన్న మాల్‌లో నిన్న రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో 10 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటిస్తున్నా. ప్రమాదానికి కారణమైన వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. బాధిత కుటుంబాలు నన్ను క్షమించమని కోరుతున్నా' అంటూ ఆయన కోరారు.