బ్రహ్మపుత్ర నదిలో ఘోర ప్రమాదం.. భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను..
అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 120 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవ.. ప్రభుత్వానికి చెందిన ఓ స్టీమర్‌ను ఢీకొట్టి మునిగిపోయింది. జోర్హాత్ జిల్లాలోని నీమతి ఘాట్ సమీపంలో బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇప్పటివరకూ 50 మందిని రక్షించామని, 70 మంది వరకు గల్లంతైనట్టు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్) డిప్యూటీ కమాండర్ శ్రీవాస్తవ తెలిపారు.
రాష్ట్ర జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్‌ఎఫ్)తో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. పడవ ప్రమాదంలో ఒక మహిళ మరణించినట్టు జోర్హాత్ ఎస్పీ అంకూర్ జైన్ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరుగొచ్చన్నారు.
పడవ ఢీకొన్న స్టీమర్‌లో ఉన్న లైఫ్‌గార్డుల సాయంతో కొంతమంది ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చినట్టు వెల్లడించారు. పడవలో ఉన్న వాహనాలు, బైకుల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానం వ్యక్తం చేశారు. కాగా పడవ మునిగిపోతున్న సమయంలో ప్రాణాలను రక్షించుకోవడానికి కొందరు నదిలో దూకుతున్నట్టు వీడియోల్లో రికార్డయ్యింది.
ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ.. అందరి భద్రత, శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను. అస్సాం పడవ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను పిలిచి సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను ఆయనకు తెలియజేశారు.