యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే...తొమ్మిది లక్షలు మాయం
స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ఆన్‌లైన్ మోసాలకు అదుపు లేకుండా పోయింది. ఒక్క ఫోన్ కాల్‌తో డబ్బులు పోగొట్టుకున్న ఘటనలు ఉన్నాయి. అలా ఏకంగా కుమారుడు చేసిన పనికి తొమ్మిది లక్షల రూపాయలను స్మార్ట్ మోసగాళ్లకు అర్పణం చేశాడు నాగ్‌పూర్‌కు చెందిన వ్యక్తి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరాడి ప్రాంతానికి చెందిన అశోక్ మాన్వాతే ఫోన్‌ను కుమారుడు వినియోగిస్తున్నాడు. అంతలో ఒక అపరిచితుల నుండి ఆ ఫోన్‌కు కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వారు..తమను తాము డిజిటల్ పేమేంట్స్ కంపెనీకి చెందిన కస్టమర్‌కేర్ ఎగ్జిక్యూటివ్‌గా పరిచయం చేసుకుని, డిజిల్ చెల్లింపు ఖాతాల పరిధిని పెంచుతానని, అందుకు ఓ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలంటూ సూచించాడు.
దీంతో ఆ యువకుడు ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడంతో..ఒక్కసారిగా తన తండ్రి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.8.95 లక్షల రూపాయలను మాయం చేశారు. దీంతో ఖంగుతిన్న కుమారుడు..తండ్రికి చెప్పడంతో...ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపిసి 419, 420 సెక్షన్‌లతో పాటు ఇన్పర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.