1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (08:26 IST)

కరోనా వైరస్ సూపర్ స్పైడర్‌ ప్రధాని మోడీ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్

narendra modi
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రెండో దశ వ్యాప్తి చేయిదాటిపోవడానికి ప్రధాన కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌నే కారణమనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉపాధ్యక్షుడు డాక్టర్ నవజ్యోత్ దహియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీనే కరోనా వైరస్‌ను ఎక్కువగా వ్యాప్తి చేసే సూపర్ స్ప్రెడర్ అని అభివర్ణించారు. 
 
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బహిరంగ సభలు ఏర్పాటు చేశారని, కుంభమేళాకు అనుమతించారని మోడీపై ఆరోపణలు చేశారు. "వైద్య రంగం అంతా కొవిడ్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కలిగించే యత్నాలు చేస్తున్న వేళ ప్రధాని మోడీ మాత్రం భారీ బహిరంగ సభలు పెట్టేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. కరోనా మార్గదర్శకాలన్నింటినీ గాలికొదిలేశారు" అని దహియా సంచలన ఆరోపణలు చేశారు. 
 
భారతదేశంలో తొలి కరోనా కేసు 2020 జనవరిలో నమోదైందని, ఆ సమయంలో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడానికి బదులు అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌‌ను స్వాగతించేందుకు లక్షమందితో గుజరాత్‌లో సభ ఏర్పాటు చేశారని మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
 
ఈ యేడాది పాటు వైద్య ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రధాని మోడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దాంతో కరోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజ్‌కి చేరకముందే వైద్య ఆరోగ్య వ్యవస్థ వైఫల్యం చెందుతోందని దహియా విచారం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మీడియా సైతం మోడీ వైఫల్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోందని ఆయన గుర్తుచేశారు. 
 
అంతేకాకుండా, అంతర్జాతీయ మీడియా బోనులోనూ ప్రధాని మోడీ దోషిగా నిలబడ్డారు. భారత్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ప్రధాని మోడీనే కారమణని ప్రముఖ అంతర్జాతీయ పత్రికలన్నీ కోడై కూస్తున్నాయి. అనేక పత్రికలు అయితే పతాక శీర్షికలతో వార్తలను ప్రచురిస్తున్నాయి. ఈ వార్తలపై అటు బీజేపీ నేతలు, ఇటు బీజేపీ పెద్దలుగానీ కనీసం స్పందించడం లేదు.