సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 నవంబరు 2021 (10:24 IST)

అండమాన్‌లో అల్పపీడనం.. కోస్తా జిల్లాలకు డేంజర్ బెల్స్

అండమాన్ సముద్రతీరంలో మరో అల్పపీడనం కేంద్రీకృతమైంది. దీనివల్ల తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తాతీర జిల్లాలకు వర్షం ముప్పు పొంచివుందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే గత కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఈ రెండు రాష్ట్రాల్లోని అనేక జిల్లాలు నీట మునిగిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో తాజాగా అండమాన్‌ తీరంలో మరో అల్పపీడనం కేంద్రీకృతమైనట్టు వాతావరణ కేంద్రం బాబు పేల్చింది. దీని ప్రభావం కారణంగా ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇరు రాష్ట్రాల్లోని కోస్తా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీచేసింది. ఈ అల్పపీడనం సోమవారం మరింతగా బలపడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. 
 
నెల్లూరు - చిత్తూరు జిల్లాల్లో కుండపోత వర్షం...   
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు, వదలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. శనివారం మరో మారు కుంభవృష్ఠి కురిసింది. దీంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాలు మరోమారు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 
 
మొన్న కురిసిన వర్షాలతోనే రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. చెరువులకు గండ్లు పడి గ్రామాలు జలదిగ్బంధలో చిక్కుకున్నివున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. 
 
దీని ప్రభావం కారణంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనేవుంది. 
 
అలాగే, వెంకటగిరి, కోవూరు నియోజకవర్గాల్లో రాత్రి నుంచి మోస్తరుగాను, సూళ్లూరుపేట, సర్వేపల్లి నియోజకవర్గాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా చిత్తూరు జిల్లాలను కూడా భారీ వర్షాలు ముంచెత్తాయి. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి నియోజకవర్గాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఫలితంగా అనేక పల్లపు ప్రాంతాలు మరోమారు నీటిలో చిక్కుకున్నాయి.