1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

అక్రమ కట్టడాల పేరుతో గృహాల కూల్చివేత.. ఇంజనీర్ చెంప ఛెళ్ళమనిపించిన ఎమ్మెల్యే!!

mla slaps
అక్రమ కట్టడాల పేరుతో ఇంజనీర్లు కొన్ని గృహాలను కూల్చివేశారు. దీంతో అనేక మంది పేదలు నిలువ నీడలేకుండా పోయారు. అదేసమయంలో భారీ వర్షం కురవడంతో చిన్నారులు, వృద్ధులు వర్షంలో తడిసి ముద్దయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఒకరు.. ఆ గృహాలను కూల్చివేసిన కాంట్రాక్టరు చెంపు ఛెళ్ళుమనిపించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని కాషిమిరాలోని పెంకర్ పడా అనే ప్రాంతంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను శుభమ్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన కూల్చివేశారు. ఆ సమయంలో జోరున వర్షం కురుస్తున్నది. అయినప్పటికీ అధికారులు, ఇంజనీర్లు కలిసి ఈ గృహాలను కూల్చివేశారు. దీంతో ఆరు నెలల చిన్నారి, వృద్ధురాలు నిలువ నీడలేక వర్షంలో తడిసి ముద్దయింది. దీనిపై సమాచారం అందుకున్న వీరా భయందర్ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే గీతా జైన్ అక్కడకు చేరుకుని అధికారులు, ఇంజనీర్లపై మండిపడ్డారు.
 
ముఖ్యంగా శుభమ్ పాటిల్, సోనీతో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో శుభమ్‌పై చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఎమ్మెల్యేపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆక్రమణల కూల్చివేతలో ఇంజనీర్ల తప్పేముందని వారు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఎమ్మెల్యే గీతా జైన్ తన చర్యను సమర్థించుకున్నారు.