సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 7 జులై 2023 (10:01 IST)

ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య పరుగులు పెట్టనున్న తొలి బుల్లెట్ రైలు

bullet train
భారతీయ రైల్వే శాఖ వేగవంతమైన రవాణా సౌకర్యాల కల్పనపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా, ఇప్పటికే వందే భారత్ పేరుతో సెమీ హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇపుడు హైస్పీడ్ రైళ్లను కూడా తీసుకొచ్చేందుకు దృష్టిసారించింది. ఇందుకోసం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఇది భారత్‌లో బుల్లెట్ రైల్ కలను సాకారం చేసే దిశగా ఒక కార్యాచరణను రూపొందించనుంది. అన్నీ అనుకూలంగా సాగితే తొలి బుల్లెట్ రైల్ ముంబై - అహ్మదాబాద్ ప్రాంతాల మధ్య పరుగులు పెట్టనుంది. ఇది 2027 నాటికి పట్టాలెక్కనుంది. 
 
జపాన్‌ రైల్వే శాఖ షింకాన్ సెన్ పేరిట ఎన్నో ఏళ్ళుగా అత్యంత సమర్థతతో బుల్లెట్ రైళ్లను నడుపుతున్న విషయం తెల్సిందే. ఈ హైస్పీడ్ రైళ్ళ గరిష్ట వేగం 320 కిలోమీటర్లు. ఇలాంటి బుల్లెట్ రైళ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. మొత్తం 24 షింకాన్ సెన్ రైళ్లను కొనుగోలు చేయాలని కేంద్రం భావిస్తుంది. వాటి అంచనా వ్యయం రూ.11 వేల కోట్లు. ప్రధానంగా జపనీస్ సంస్థలనే బిడ్డింగ్‌కు కేంద్రం ఆహ్వానించనుంది. జపాన్ దేశానికి చెందిన ఈ సంస్థలకు షింకాన్ సెన్ రైళ్ల తయారీ, నిర్వహణలో అపారమైన అనుభవం ఉంది. అందుకే కేంద్రం ఈ తరహా చర్య తీసుకుంది.